డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోట్లు?

10 Feb, 2018 07:37 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన ఆంబూరు డీఎస్పీ ధనరాజ్‌ (ఫైల్‌) 

లంచం కేసులో పట్టుబడిన డీఎస్పీ 

బాణసంచా పేల్చి, స్వీట్లు పంచుకున్న  స్థానికులు

వేలూరు : లంచం కేసులో పట్టుబడి కటకటాల పాలైన ఆంబూరు డీఎస్పీ నెల ఆదాయం రూ.1.50 కోటి అని వదంతులు వ్యాపించాయి. వేలూరు జిల్లా ఆంబూరు డీఎస్పీ ధనరాజ్, ఎస్‌ఐ లూర్దు జయరాజ్‌  ఇసుక క్వారీ నడుపుతున్న వ్యక్తి వద్ద రూ.1.45 లక్షలు లంచం తీసుకుంటూ విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంబూరు డీఎస్పీ ఇసుక అక్రమ రవాణా, నాటుసారా, కట్ట పంచాయితీ చేసే ముఠా సభ్యుల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకోవడం వీటికి ఆయా స్టేషన్లలోని ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ల ద్వారా నగదును తీసుకుంటున్నట్లు వదంతులు వచ్చాయి. విజిలెన్స్‌ అధికారులు డీఎస్పీ ధనరాజ్, ఎస్‌ఐలను గురువారం రాత్రి 12 గంటల వరకు రహస్యంగా విచారణ జరిపి న్యాయమూర్తి రాజు ముందు హాజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో వేలూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

డీఎస్పీ ధనరాజ్‌ గతేడాది విరుదనగర్‌ జిల్లా నుంచి బదిలీపై ఆంబూరుకు వచ్చారు. విరుదునగర్‌లో పనిచేసిన సమయంలోనే నాటు సారా అక్రమరవాణ దారులు, కిడ్నాపర్ల నుంచి ప్రతినెలా మామూళ్లు తీసుకునే వాడని అనంతరం ఆంబూరులోని ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియా వద్ద ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని వేధింపులకు గురి చేసే వాడని ఇవ్వకుంటే కేసులు నమోదు చేసే వాడని తెలిసింది. ఈ మామూళ్లు ఇవ్వడంతోనే ఇసుక మాఫియా ముఠా సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించే వారని తెలిసింది. డీఎస్పీ లంచం కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలుసుకున్న ఆంబూరు వాసులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట బాణసంచా పేల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు.  
 

మరిన్ని వార్తలు