ప్రజలను రక్షించేందుకే పోలీసులు

18 Apr, 2018 11:23 IST|Sakshi
మంబోజిపల్లిలో ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న డీఎస్పీ

కార్డన్‌ సెర్చ్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్లు

మెదక్‌రూరల్‌: ప్రజలను రక్షించేందుకే పోలీసులు ఉన్నారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని మెదక్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ మండల పరిధిలోని మంబోజిపల్లి గ్రామంలో ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతీ ఇంటిని తనిఖీ చేసి వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకే పోలీసులు ఉన్నారన్నారు. పోలీసులు అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తెలియజేయాలని తెలిపారు. ప్రజలు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

కార్డన్‌ సెర్చ్‌లో భాగంగా ఇంటింటికీ తనిఖీలు చేస్తామని అనుమానితులుగా ఎవరు కనిపించినా, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు ఉన్నా పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. వాహనాల పత్రాలు తీసుకొస్తే యజమానులకు వాహనాలను అప్పగిస్తామని, లేని పక్షంలో కోర్టుకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్డన్‌ సెర్చ్‌లో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 12 మంది ఏఎస్‌ఐలు, 42 కానిస్టేబుల్స్, 50 మంది ట్రైనింగ్‌ సిబ్బంది.. మొత్తం 125 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రామకృష్ణ, భాస్కర్, రవీందర్‌రెడ్డి, మెదక్‌ రూరల్‌ ఎస్‌ఐ లింబాద్రి, సందీప్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు