భూ వివాదం నిండు ప్రాణం బలి

4 Apr, 2019 12:17 IST|Sakshi

సాక్షి, జగ్గంపేట: భూ వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య తరఫు భూమికి సంబంధించి గోనేడ గ్రామానికి చెందిన వారితో నెలకొన్న వివాదం హత్యకు దారితీసినట్టు తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. జగ్గంపేట మండలం రామవరం శివారులో పిఠాపురం మండలం మంగుతుర్తికి చెందిన పేకేటి పేర్రాజు అనే రాజా (56) మృతదేహాన్ని పంట కాల్వలో పోలీసులు బుధవారం గుర్తించారు. పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ రాంబాబు, ఎస్సై రామకృష్ణ, సిబ్బంది మృతదేహాన్ని బయటకు వెలికి తీయించడంతో ఒంటి నిండా తీవ్ర గాయాలు గుర్తించారు. హత్య చేసి కాల్వలో పడేసి ఉంటారని ప్రాథమికం అంచనాకు వచ్చారు. పేర్రాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాకినాడలో మకాం ఉంటున్నారు.

గతంలో ఎన్‌ఎఫ్‌సీఎల్‌లో పనిచేసి ఉద్యోగం మానేశాడు. మాజీ ఎంపీ దివంగత తోట సుబ్బారావుకు వరసకు మేనల్లుడయ్యే పేర్రాజుకు భార్య తరఫున భూమి జగ్గంపేట మండలం రామవరంలో ఉంది. ఈ భూమిపై కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన వారితో వివాదం నెలకొంది. బుధవారం ఉదయం కాకినాడ నుంచి తన కారులో రామవరం పొలం వద్దకు వచ్చారు. కారు రోడ్డు పక్కన పెట్టి పొలం వద్ద లోపలకు వెళ్లగా అక్కడ చోటు చేసుకున్న వివాదంలో పేర్రాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి పంట కాల్వలో విడిచిపెట్టి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులకు పొలం సమీపంలో ఉదయం పూట ఉన్న వారిని విచారిస్తున్నారు. దివంగత మాజీ ఎంపీ తోట సుబ్బారావు కుమారుడు సర్వారాయుడు సంఘటన స్థలం వద్దకు చేరుకుని భూ వివాదం గురించి పోలీసులకు వివరించారు. ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, హంతకులు పరారీలో ఉన్నట్టు సీఐ రాంబాబు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా