మౌనంగా రోదించి.. తనువు చాలించి..

12 Sep, 2018 14:08 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న జహుర్‌బీ, రోదిస్తున్న జహుర్‌బీ తల్లి, కుటుంబ సభ్యులు

దివ్యాంగురాలు ఆత్మహత్య

పుట్టినప్పటి నుంచి మూగ, చెవుడు

భర్త నుంచి వేధింపులు

దేశమంతా మంగళవారం ఆత్మహత్యల నివారణ దినాన్ని నిర్వహిస్తున్న వేళ.. ఓ అభాగ్యురాలు అదే అఘాయిత్యం చేసుకోవడం విషాదకరం.. ఆమెకు పుట్టుకతోనే మూగ, చెవుడు.. చిన్నప్పటి నుంచి బాధలు భరిస్తోంది.. కుటుంబ ఆర్థిక సమస్యలు అష్టకష్టాలకు గురి చేశాయి... ఇలాంటి సమయంలో ఆదరించాల్సిన భర్త వేధించడం మొదలెట్టాడు... ఆమె మౌనంగా భరించిందే కానీ పల్లెత్తు మాట అనలేని పరిస్థితి... అయినా ఆరళ్లు ఎక్కువ కావడంతో తనువు చాలించింది.

ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని అమృతానగర్‌కు చెందిన కొండపల్లి జహుర్‌బీ (23) మంగళవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అమృతానగర్‌లోని మాబుషరీఫ్‌నకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె జహుర్‌బీ, మూడో కుమార్తె ఫాతిమాకు పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్నాయి. రెండో కుమార్తె మాబుచాన్‌ ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. జహుర్‌బీకి 9 నెలల క్రితం బద్వేలుకు చెందిన జిలాన్‌తో వివాహం చేశారు. అతను లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద ఒకటిన్నర తులం బంగారు, రూ.15 వేల నగదు ఇచ్చారు. పెళ్లి అయ్యాక జహుర్‌బీ అమ్మగారింట్లోనే కాపురం ఉండేలా.. వారి మధ్య అంగీకారం కుదిరింది. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ వారింట్లోనే ఉంటున్నారు.

వేరుగా కాపురం ఉండాలనిచెప్పడంతో..
వయసు మీద పడటంతో మాబుషరీఫ్‌ పనికి వెళ్లడం మానేశాడు. ఆయన భార్య ఖాదర్‌బీ మిల్లులో పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. అల్లుడు, కుమార్తె కూడా ఇంటిలోనే ఉండటంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. కుమార్తె, భర్తను వేరుగా కాపురం పెట్టించాలని తమ ఇంటి పక్కనే తండ్రి బాడుగ ఇల్లు కూడా చూశాడు. ఇదే విషయాన్ని అల్లుడు జిలాన్‌తో చెప్పాడు. అయితే అతను వేరుగా కాపురం ఉండటానికి అంగీకరించలేదు. ‘పక్కన కాపురం పెట్టాల్సి వస్తే ఇక్కడ ఎందుకు ఉంటాను.. మా ఊరికి వెళ్తాను’ అని చెప్పి అత్తామామలతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో గత నెల 17న జిలాన్‌ భార్యను పిలుచుకొని బద్వేలు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన నాటి నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. అతను తాగి వచ్చి రోజూ భార్యను వేధించేవాడు. ఈ నెల 4న దివ్యాంగుల పింఛన్‌ కోసం బద్వేలు నుంచి జహుర్‌బీ ఆమె అత్తతో కలసి ప్రొద్దుటూరు వచ్చింది. పింఛన్‌ తీసుకున్న వెంటనే బద్వేలుకు వెళ్లారు.

బాధలు తండ్రితో తెలుపుకొని..
భర్త వేధింపులు ఎక్కువ కావడంతో రెండు రోజుల క్రితం ఆమె తండ్రికి ఫోన్‌ చేసింది. దీంతో ఆయన సోమవారం బద్వేలు వెళ్లగా.. భర్త పెట్టే బాధలను సైగల ద్వారా చెప్పుకొని రోదించింది. కుమార్తెను వెంట తీసుకొని ఆయన అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరు వచ్చాడు. మంగళవారం ఉదయం తల్లి, మరో చెల్లెలు మిల్లులోకి పనికి వెళ్లగా, రెండో చెల్లెలు పాఠశాలకు వెళ్లింది. తండ్రి పని మీద పట్టణంలోకి వెళ్లాడు. అతను మధ్యాహ్నం ఇంటికి వచ్చి తలుపులు తీయడానికి ప్రయత్నించగా లోపల గడియ వేసి ఉంది. కుమార్తె పడుకొని ఉందేమోనని భావించి బయట పడుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు దాటినా కుమార్తె వాకిలి తీయకపోవడంతో మిద్దెపైకి వెళ్లి గవాచిలో నుంచి చూడగా.. జహుర్‌బీ ఉరికి వేలాడుతూ కనిపించింది. గట్టిగా రోదిస్తూ తండ్రి కిందికి దిగి వచ్చాడు. ఆమె దూలానికి చీర కట్టి ఉరి వేసుకుంది. విషయం తెలియడంతో రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్, ఏఎస్‌ఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు జిలాన్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు