పసుపు,కుంకుమ నగదు కోసం వచ్చి పరలోకానికి..

19 Feb, 2019 07:32 IST|Sakshi
నీలవేణి మృతదేహం వద్ద విలపిస్తున్న కుమార్తె, బంధువులు

ఆటో బోల్తా పడి డ్వాక్రా మహిళ మృతి

బ్యాంకు నుంచి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం

మరో పది మందికి గాయాలు పాడేరు ఆస్పత్రికి తరలింపు

విశాఖపట్నం, పాడేరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన పసుపు,కుంకుమ చెక్కులు    మార్చుకునేందుకు మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.   ఈ చెక్కును మార్చుకునేందుకు వెళ్లిన ఓ మహిళ సోమవారం దుర్మరణం చెందింది.  వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు,కుంకుమ చెక్కులను పాడేరు యూనియన్‌ బ్యాంకులో తమ ఖాతాలో జమ చేసుకొని, నగదు తీసుకునేందుకు  హుకుంపేట మండలం బాకూరు పంచాయతీ గొప్పులపాలెం గ్రామానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు సోమవారం వచ్చారు. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సేవలు స్తంభించడం, బ్యాంకులో లింక్‌ ఫెయిల్‌ కావడంతో నగదు తీసుకునేందుకు వీలుపడలేదు. దీంతో మహిళలు ఓ ఆటోలో గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హుకుంపేట సమీపంలోని రాళ్ళగెడ్డ వంతెన వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో గొప్పులపాలెం గ్రామానికి చెందిన సూకురు నీలవేణి(45) అనే  మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

ఆటోలో ప్రయాణిస్తున్న అదే గ్రామానికి చెందిన చెదల చిలకమ్మ, చెదల బుల్లమ్మలతో పాటు  మొత్తం మంది మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చేరి   చికిత్స  పొందారు. పోస్టుమార్టం కోసం నీలవేణి మృతదేహాన్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రి మార్చురీ వద్ద నీలవేణి కుమార్తె, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన డ్వాక్రా మహిళ నీలవేణి భర్త ఏడాది క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలిపనులు చేస్తూ కుమార్తె, కుమారుడిని చదివిస్తోంది. ఆటో ప్రమాదంలో ఇప్పుడు తల్లి కూడా మృతి చెందడంతో వారు అనాథలయ్యారు.
 

మరిన్ని వార్తలు