రెండో రోజూ కొనసాగిన ‘ఎంసెట్‌’ విచారణ

15 Jul, 2018 03:08 IST|Sakshi
సీఐడీ పోలీసుల కస్టడీలో ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ నిందితులు

శివనారాయణను కటక్‌ తీసుకెళ్లిన సీఐడీ

వాసుబాబును విచారించిన మరో బృందం

మరికొంత మందికీ వాసు ప్రశ్నపత్రం ఇచ్చినట్లు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ కాలేజీ ఏజెంట్‌ శివనారాయణ, శ్రీచైతన్య మాజీ డీన్‌ వాసుబాబుల విచారణ రెండో రోజు కూడా కొనసాగింది. శివనారాయణ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు శనివారం మధ్యాహ్నం అతన్ని కటక్‌ తీసుకెళ్లినట్లు సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులతో కటక్‌లోనే శివనారాయణ క్యాంపు నడిపినందున అక్కడి బ్రోకర్ల జాడ తెలిసే అవకాశముందని, క్రైమ్‌ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ కూడా చేయాల్సి ఉండటంతో అతన్ని అక్కడికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక శ్రీచైతన్య మాజీ డీన్‌ వాసుబాబును హైదరాబాద్‌లో మరో బృందం విచారించింది. ముగ్గురు విద్యార్థులకే కాకుండా మరో నలుగురికి వాసుబాబు ప్రశ్నపత్రం ఇచ్చినట్లు విచారణలో సీఐడీ గుర్తించింది.

కానీ, తాను ముగ్గురినే క్యాంపునకు తరలించినట్లు వాసు చెబుతుండటంతో రుజువులతో సహా ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేలో పరీక్ష జరగాల్సి ఉండగా ఫిబ్రవరి నుంచే కొంతమంది విద్యార్థులతో వాసు టచ్‌లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. దీంతో వారితో వాసు ఎందుకు టచ్‌లో ఉన్నాడో చెప్పాలని సీఐడీ ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే రెండు రాష్ట్రాల్లోని శ్రీచైతన్య కళాశాలల విద్యార్థులను హైదరాబాద్‌ పిలిపించి మాట్లాడారని, ప్రశ్నపత్రం వ్యవహారంపైనే చర్చించారా అని అధికారులు వివరణ కోరినట్లు తెలిసింది.  

మళ్లీ బ్రోకర్ల విచారణ
వాసుబాబు, శివనారాయణ ద్వారా విద్యార్థులను క్యాంపులకు పంపిన తల్లిదండ్రుల వాంగ్మూలాలు సేకరించాలని సీఐడీ నిర్ణయించింది.  వారిరువురూ డీల్‌ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులను వారి ముందే ప్రశ్నించనుంది. రూ.35 లక్షల చొప్పున డీల్‌ సెట్‌ చేసుకున్న వీరు అడ్వాన్స్‌గా ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షలు, పూచీకత్తుగా పదో తరగతి సర్టిఫికెట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. వీరి నుంచి రికవరీ లేకపోవడంతో ఈ రెండు అంశాలపై తల్లిదండ్రుల నుంచి వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ప్రతి అంశంపైనా వారు పొంతన లేకుండా వ్యవహరించడంతో సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.  ఎక్కడా సరిగా సమాధానాలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆయా బ్రోకర్లను సైతం మళ్లీ విచారణకు పిలుస్తున్నామని  ఉన్నతాధి కారి ఒకరు చెప్పారు. అప్పుడే వారి బాగోతం వెలు గులోకి వస్తుందని, కార్పొరేట్‌ సంస్థల చీకటి వ్యవహా రం కూడా ఆధారాలతో బయటపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు