బతుకుదెరువు పయనం విషాదాంతం

22 May, 2020 13:46 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో ముగ్గురుజిల్లా వాసులు మృతి

ఐదుగురికి గాయాలు

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఘటన

మృతుల్లో భార్యాభర్తలు, మరో యువతి

గోకవరం: తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి శివారున గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన దంపతులు గీసాల శ్రీను (48), లక్ష్మి (40), కరప మండలం గొర్రిపూడికి చెందిన కండనెల్ల లక్ష్మీచందన (18) అనే యువతి మృత్యువాత పడ్డారు. ఇదే ప్రమాదంలో కొత్తపల్లికి చెందిన దయ్యాల రాంబాబు, అతని తల్లి లక్ష్మి, లక్ష్మీచందన సోదరుడు ఖండవల్లి వీరబాబు, మరో ఇద్దరు చిన్నారులు గాయాలతో బయటపడ్డారు. వీరంతా బుధవారం సాయంత్రం కారులో హైదరాబాద్‌ బయలుదేరి వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు గురువారం తెల్లవారుజామున రహదారి పక్కన ఆగి ఉన్న ధాన్యం లోడు లారీని ఢీకొట్టింది.

ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస
ప్రమాదంలో మృతి చెందిన కొత్తపల్లికి చెందిన గీసాల శ్రీను, లక్ష్మీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీను ఎనిమిదేళ్ల క్రితం వరకు గ్రామంలోనే వ్యవసాయ పనులు చేసుకోగా పనులు లేకపోవడంతో బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. శ్రీను అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా, అతని భార్య లక్ష్మి అపార్ట్‌మెంట్‌లో చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు చదువుకుంటున్నాడు. 

శుభకార్యం కోసం వచ్చి లాక్‌డౌన్‌లో చిక్కుకుని..
మార్చి 19న తన గీసాల శ్రీను సోదరుడి కుమారుడి వివాహం కోసం భార్యాభర్తలు మార్చి 15న కొత్తపల్లి వచ్చారు. వివాహం అనంతరం కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో ఇక్కడే ఉండిపోయారు. బుధవారం రాత్రి వరకు కుటుంబంతో ఉత్సాహంగా గడిపిన వారు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. భార్యాభర్తలు ఇరువురిదీ కొత్తపల్లి కాగా వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వీరిద్దరి తల్లులు గీసాల సింహాచలం, గుత్తుల గన్నెమ్మలు వృద్ధాప్యంలో వచ్చిన ఈ కష్టాన్ని తట్టుకోలేక విలపించిన తీరు చూపరులను కంటితడి పెట్టించింది. హైదరాబాద్‌ వెళ్లేందుకు కారుకు ఒక్కొక్కరికీ రూ.3 వేలకు మాట్లాడుకుని వీరు ప్రయాణమయ్యారు. కారు రాకుండా ఉంటే వారు బయలుదేరేవారు కారని, ప్రమాదం సంభవించేది కాదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న కొత్తపల్లి వాసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జాతరకు అమ్మమ్మ ఇంటికి వచ్చి
ప్రమాదంలో మృతిచెందిన యువతి కండనెల్ల లక్ష్మీచందన తల్లిదండ్రులు వీరమణి, లక్ష్మణ్‌ కరప మండలం గొర్రిపూడికి చెందినవారు. వీరు కుటుంబంతో సహా పనులకు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. మల్లిసాలలో జరిగే సింగారమ్మతల్లి జాతర కోసం మార్చి నెలలో వీరమణి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చింది. జాతర అనంతరం పిల్లలను మల్లిసాలలో ఉంచి వీరమణి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా అమ్మమ్మ ఇంటి వద్దే ఉండిపోయిన వారు గత నెల 21న తమ్ముడు వీరబాబు జన్మదినం జరుపుకోగా, మృతి చెందిన లక్ష్మీచందన మే 1న పుట్టినరోజు వేడుక జరుపుకొంది. అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుతూ పాడుతూ గడిపిన లక్ష్మీచందన అకాల మరణం చెందడంతో వారంతా బోరున విలపిస్తున్నారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల ముందు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడిందని, ఇంతలోనే దుర్ఘటన జరిగినట్టు మళ్లీ ఫోన్‌ వచ్చిందని అమ్మమ్మ, తాతయ్యలు గెంజేటి సీతారత్నం, కన్నబ్బాయి కన్నీటి పర్యంతమయ్యారు.

రూ.3 వేలకు కిరాయి
నాలుగో విడత లాక్‌డౌన్‌లో భాగంగా కొన్ని సడలింపులు ఇవ్వడంతో హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న కొత్తపల్లి గ్రామానికే చెందిన దయ్యాల రాంబాబు బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కారుపై కొత్తపల్లి వచ్చాడు. అతను సాయంత్రం తిరుగు ప్రయాణం కావడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన వీరంతా ఒక్కొక్కరూ రూ.3 వేలుకు కిరాయి మాట్లాడుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో వీరి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రాణం తీసిన అతివేగం
చిట్యాల :  న ల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని వట్టిమర్తి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదానికి డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని తెలిసింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినట్టు  నార్కట్‌పల్లి సీఐ శంకర్‌రెడ్డి తెలిపారు.

ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు  
అతివేగంగా కారు లారీని ఢీ కొట్టినప్పటికీ డ్రైవర్‌ రాంబాబుతోపాటు కారు ముందు సీట్‌లో కూర్చున్న దయ్యాల లక్ష్మి, వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురు చిన్నారులు సీటు బెల్టులు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మధ్య సీట్లలో కూర్చున్న గీసాల శ్రీనివాస్, గీసాల లక్ష్మి, లక్ష్మీచందన సీటు బెల్టులు పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే సీట్ల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. 

డీఎస్పీ సందర్శన  
ఘటనా స్థలాన్ని నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సై రాజును అడిగి తెలుసుకున్నారు. అతివేగంగా, అజాగ్రత్తగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు దయ్యాల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు