ఈజీ మైండ్‌ ఇట్టే ముంచేసింది..

16 Jun, 2019 08:26 IST|Sakshi

ఈసారి తుమకూరులో జనం సొమ్ము స్వాహా  

రకరకాల స్కీములతో డిపాజిట్ల సేకరణ  

రూ.600 కోట్లతో దుబాయ్‌కి ఉడాయింపు!  

నిందితుడు అస్లాంపై బాధితుల ఫిర్యాదు  

అతని దుకాణం వద్ద బాధితుల ఆందోళన

తుమకూరు: రాజధానిలో బయటపడిన వేలాది కోట్ల ఐఎంఏ జ్యువెల్లర్స్‌ కుంభకోణం సద్దుమణగక ముందే అదే దారిలో మరో ఘరానా కంపెనీ ప్రజలను నిండా ముంచేసి బోర్డు తిప్పేసింది. చదువులు, పెళ్లిళ్లు, జనరల్‌ ప్లాన్స్‌ ఇలా పలు రకాల స్కీములతో అమాయక ప్రజలను నమ్మించి భారీగా నగదు సేకరించి షట్టర్‌ మూసేసింది. తుమకూరు నగరానికి చెందిన మహ్మద్‌ అస్లాం అనే వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా హెచ్‌ఎంఎస్‌ షాదీ మహల్‌ ఆవరణలోని వాణిజ్య సముదాయంలో ‘ఈజీ మైండ్‌’ పేరుతో మార్కెటింగ్‌ కంపెనీ నిర్వహిస్తున్నాడు. పలు రకాల స్కీములతో పాటు ఓలా, ఉబర్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి వచ్చే లాభాల్లో వాటాలు ఇస్తానంటూ ప్రజలను ఆకర్షించాడు.  ఇలా సుమారు ఐదు లక్షల మంది నుంచి రూ.600 కోట్ల మేర సేకరించినట్లు బాధితులు, పోలీసులు చెబుతున్నారు. తుమకూరుతో పాటు ఇతర జిల్లాలు, కేరళ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రజల నుంచి కూడా డబ్బులు సేకరించాడు. కంపెనీలో పని చేసే ఉద్యోగులు సైతం రెండింతలు డబ్బులు వస్తాయనే ఆశతో తమ జీతాలు కూడా కంపెనీలో పెట్టి మోసపోయారు.  

మార్చిలోనే దుబాయ్‌కి పరారీ   
భారీ మొత్తంలో నగదు చేకూరడంతో బోర్డు తిప్పేసి మూడో కంటికి తెలియకుండా మార్చిలో దుబాయ్‌కు పారిపోయాడు. మార్చ్‌లో మూతబడ్డ ఈజీ మైండ్‌ కార్యాలయం తలుపులు ఈరోజో రేపో తెరుచుకుంటాయని ప్రతి రోజూ ఆశగా పడిగాపులు పడుతున్న బాధితులకు నిరాశే మిగిలింది. మూడునెలలైనా తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయిండంతో ఘటన వెలుగు చూసింది.  

వెల్లువెత్తిన బాధితులు  
తమకు న్యాయం చేయాలంటూ బాధితులు జిల్లా ఎస్పీ వంశీకృష్ణకు మొర పెట్టుకోవడంతో విచారణ జరిపించాలంటూ డీవైఎస్పీ తిప్పేస్వామికి సూచించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు మహ్మద్‌ కోసం వేట మొదలుపెట్టారు. ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే రఫిక్‌ అహ్మద్‌.. ప్రజలను వంచించిన నిందితుడు ఎక్కడ దాక్కున్నా అరెస్ట్‌ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. పెద్దసంఖ్యలో బాధితులు గొల్లుమంటూ వెల్లువెత్తారు.    

>
మరిన్ని వార్తలు