బయటపడ్డ ఈ బిజ్‌ సంస్థ మోసాలు

12 Mar, 2019 16:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రీగోల్డ్‌, క్యూనెట్‌ వంటి స్కాంల గొడవ తేలక ముందే భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగు చూసింది. సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో ఈ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ మీడియాకు వెల్లడించారు. ‘ఈ బిజ్‌ అనే మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ప్రజలను మోసం చేసి దాదాపు రూ. 1000 కోట్లు వసూలు చేసింది. 2001లో నోయిడా కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతుంది. ఇప్పటికే ఈ సంస్థలో దేశవ్యాప్తంగా దాదాపు 7లక్షల మంది సభ్యులు ఉన్నారు. వారి దగ్గర నుంచి సంస్థ నిర్వాహకులు ఇప్పటి వరకూ సుమారు రూ.1000 కోట్లు వసూలు చేశార’ని సజ్జనార్‌ తెలిపారు.

సజ్జనార్‌ మాట్లాడుతూ.. ‘తొలుత సంస్థలో రూ.16వేలు కట్టి సభ్యులుగా చేరితే 10వేల పాయింట్లు ఇస్తారు. ఆ తరువాత ఎంతమందిని జాయిన్‌ చేస్తే.. అంత కమిషన్‌ ఇస్తామంటారు. యువతను ఆకట్టుకొనేందుకు ఈ లెర్నింగ్‌ కోర్సు, కంప్యూటర్‌ కోర్సులు నేర్పిస్తామని చెప్తారు. అనంతరం ధ్రువపత్రం ఇస్తారు. కానీ వీటికి ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. దేశవ్యాప్తంగా ఈ స్కాం బాధితులున్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై పరిధిలో ఎక్కువ మంది ఉన్నార’ని సజ్జనార్‌ తెలిపారు. జగిత్యాలకు చెందిన సామల్ల వివేక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కాం వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ బిజ్‌ నిర్వాహకుడు హితిక్‌ మల్హాన్‌ను అరెస్ట్‌ చేశామని.. అంతేకాక సంస్ధ బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న రూ.70 లక్షలను ఫ్రీజ్‌ చేశామని సజ‍్జనార్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు