ఇలా బతకటం కంటే...

21 Jun, 2018 18:24 IST|Sakshi
పాంగ్‌ చింగ్‌-యూ (పాత చిత్రం)

చలాకీగా ఉంటూ అందరితో సరదాగా గడిపే యువతి. అయితే అరుదైన వ్యాధి ఆమెను మానసికంగా కుంగదీసింది. లాభం లేదనుకున్న యువతి.. తల్లిదండ్రులను చంపి, ఆత్మహత్య చేసుకుంది. ఫాదర్స్‌ డే రోజున హంగ్‌ కాంగ్‌లో జరిగిన విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే...

హంగ్‌ కాంగ్‌ సిటీ: ట్యూన్‌ మూన్‌కు చెందిన పాంగ్‌ చింగ్‌-యూ(23) నర్సింగ్‌ విద్యార్థిని. చదువులతోపాటు ఆటల్లో చురుకుగా ఉండే యువతి. అయితే కొన్నాళ్లుగా ఆమె ఎక్జిమా(చర్మ​ వ్యాధితో)తో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన ఆమె దారుణానికి పాల్పడింది. ఈ నెల 17వ తేదీన తల్లిదండ్రులను కత్తితో పొడిచి, ఆపై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పాంగ్‌ బెడ్‌ రూమ్‌లో సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ‘ఎక్జిమా వ్యాధిగ్రస్తులకు పిల్లలుగా పుట్టడం కంటే.. పేదరికంలో పుట్టడం చాలా నయం. ఎందుకంటే పేదరికంలో పుడితే.. బతుకులను మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఎక్జిమాతో పుడితే చచ్చేదాకా అంతే. సూర్య కాంతిని, అంతెందుకు... అద్దంలో నా ముఖం నేను చూసుకోలేని పరిస్థితి. ఇలాంటి బతుకు కంటే చావటం మంచిదని నిర్ణయించుకున్నా. నా ఈ పరిస్థితికి నా పెరెంట్సే కారణం. అందుకు వాళ్లను కూడా తీసుకుపోతున్నా’ అని ఆమె సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. 

ఎక్జిమా అన్నది సాధారణంగా చిన్న పిల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని పెద్దయ్యాక కూడా దాని లక్షణాలు బయటపడ్డవారు చాలా మందే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఎక్జిమా చికిత్స కోసం వాడే మందులతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా డిప్రెషన్‌లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్జిమాతో బాధపడుతున్న వారిలో 30 శాతం డిప్రెషన్‌తో కూడా బాధపడుతుండటమే ఇందుకు తార్కాణమని వైద్యులు తెలిపారు.(ఎక్జిమాకి వైద్యం ఏదీ లేదు. కనుక, బాధను తగ్గించడం మరియు దురద నుండి ఉపశమనం లాంటి చికిత్సలు మాత్రమే ఉన్నాయి)

మరిన్ని వార్తలు