దత్త పుత్రుడినంటూ కోట్లు కొట్టేశాడు

21 Nov, 2019 16:48 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : బ్రిటీష్‌ వ్యక్తికి దత్త పుత్రుడినంటూ తప్పుడు పత్రాలతో మైసూరులో ఓ వ్యక్తి కోట్లు కొట్టేశాడు. ఈడీ విచారణలో ఈ వాస్తవం బయటపడగా, ప్రస్తుతం నిందితుడి మీద విచారణ కొనసాగుతోంది. ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం..  బ్రిటీష​ జాతీయుడైన ఎడ్విన్‌ జూబర్ట్‌ వాన్‌ ఇంగెన్‌ అనే వ్యక్తి మైసూరు రాజుల దగ్గర టాక్సిడెర్మిస్ట్‌ (చనిపోయిన జంతువుల చర్మాలను సేకరించి అవి బతికున్నట్టుగా భ్రమింపజేసే ఒక కళ)గా పనిచేశాడు. ఇండియాలో నివసిస్తున్న ఇతను పెళ్లి చేసుకోలేదు. 101 ఏళ్ల వయసులో 2013లో చనిపోయాడు. మైసూరు రాజులు అప్పట్లో ఇతని పనిని మెచ్చి విలువైన బహుమతులు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మైసూరులోని గుర్రపు చోదకుల శిక్షకుడు మైకేల్‌ ఫ్లైడ్‌ ఈశ్వర్‌ అనే వ్యక్తి.. ఎడ్విన్‌ జీవిత చరమాంకంలో ఉండగా, తాను ఎడ్విన్‌కు దత్తపుత్రుడినంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించాడు.

అంతేకాక, ఎడ్విన్‌ చనిపోకముందే తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించి ఎడ్విన్‌ పేరు మీదనున్న ఆస్తినంతటినీ తన పేరన బదలాయించుకున్నాడు. ఈ విషయంపై ఎడ్విన్‌ 2013లో చనిపోయే ముందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎడ్విన్‌ చనిపోవడంతో ఈ కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీకి బదలాయించగా, అప్పటినుంచి ఆ విభాగం దర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్‌ జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం బుధవారం ఈశ్వర్‌ నివాసంపై రైడ్‌ చేసింది. ఈ దాడిలో విలువైన వివిధ రకాల జంతువుల చర్మాలు, అస్థిపంజరాలు, కొమ్ములు వంటివి సుమారు 70 దాకా పట్టుబడ్డాయి. అంతేకాక, మైసూరులో నగరంలో ఒక ఇల్లు, కేరళలోని వయనాడ్‌లో ఓ కాఫీ తోట ఉన్నట్టు బయటపడింది. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో 117 కోట్ల పైచిలుకు విలువ ఉంటుందని ఈడీ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు