జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌కు ఈడీ షాక్‌

5 Mar, 2020 10:19 IST|Sakshi

సాక్షి, ముంబై:  జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్‌ నరేష్ గోయల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) భారీ షాక్‌ ఇచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో నరేష్‌ గోయల్‌ ఇంటిపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహంచారు. అలాగే  గోయల్‌తోపాటు మరికొందరిపై ఈడీ తాజాగా కేసులు నమోదు చేసింది. 

ముంబై పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం  (పీఎంఎల్‌ఏ)  కింద క్రిమినల్ కేసు నమోదైందని ఈడీ అధికారులు తెలిపారు. బుధవారం కూడా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి, విచారణ చేపట్టామని, దాడులు కొనసాగుతున్నాయని అధికారులు గురువారం తెలిపారు. జెట్‌ఎయిర్‌వేస్‌లో పెద్ద ఎత్తున నిధుల దారిమళ్లింపు సహా పలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ  గత ఏడాది ఆగస్టులో గోయల్, అతని కుటుంబం, ఇతరులపై విదేశీ మారకద్రవ్య చట్ట (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై దాడులు నిర్వహించింది. ఇదే కేసులో గత ఏడాది సెప్టెంబర్‌లో గోయల్‌ను విచారించింది. గోయల్‌కు 19 ప్రైవేటు కంపెనీలు ఉన్నాయని, వీటిలో ఐదు విదేశాల్లో ఉన్నాయిని ఈడీ గతంలో ఆరోపించింది. అమ్మకం, పంపిణీ, నిర్వహణ ఖర్చులు ముసుగులో ఈ సంస్థలు "అనుమానాస్పద" లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను  ఈడీ పరిశీలిస్తోంది.  కాగా అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ గత ఏడాది ఏప్రిల్‌లో తన కార్యకలాపాలను మూసివేసింది. దీనికి ఒక నెల ముందు, గోయల్ జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా