సార్‌ ఎవరు?  

21 Feb, 2019 02:37 IST|Sakshi

ఆయన నుంచే రూ.50 లక్షలు తీసుకొచ్చారా?

ఈ కేసులో చంద్రబాబు  పాత్ర ఏమిటి?

రేవంత్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ

వరుసగా రెండో రోజూ విచారణ

ఈడీ గురి ఆ గట్టువైపే ఉందని రేవంత్‌ వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతుండటం.. త్వరలోనే మరింతమంది కీలకమైన వ్యక్తులను విచారించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విచారణ రెండోరోజూ కొనసాగింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయానికి వచ్చిన రేవంత్‌ను రాత్రి 7.45 గంటల వరకు అధికారులు సుదీర్ఘంగా విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌çసన్‌కు లంచంగా ఇవ్వజూపిన రూ.5 కోట్లపైనా, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపైనా ఈడీ అధికారులు ఆరాతీశారు. ఈ కేసులో ఇప్పటికే విచారించిన ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డిలు చెప్పిన విషయాల ఆధారంగా రూపొందించిన ప్రశ్నావళినే బుధవారమూ కొనసాగించారు. ఆ రూ.50 లక్షలు ఎలా వచ్చాయి? అవి ఇస్తానన్న సార్‌ ఎవరు? నగరానికి డబ్బు ఎలా వచ్చింది? ఇక్కడిదేనా లేక హవాలా రూపంలో వచ్చిందా? రూ.4.5 కోట్లు ఎక్కడుంచారు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. వీడియోలో పదే పదే ప్రస్తావించిన సార్‌ ఎవరు? ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఏంటని ఆరా తీసినట్లు సమాచారం. మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై రేవంత్‌ ముక్తసరిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. చాలావాటికి గుర్తులేదనే చెప్పినట్లు సమాచారం. రేవంత్‌ చెప్పే విషయాలను ధ్రువీకరించుకునేందుకు గతంలో కేసును విచారించిన ఐటీ, ఏసీబీ అధికారుల సహాయం తీసుకున్నారు. ఈడీ అధికారులు తమకు సందేహం వచ్చిన ప్రతీసారి పక్క గదిలో ఉన్న ఐటీ, ఏసీబీ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

చంద్రబాబుకు నోటీసులిచ్చే విషయం తెలియదు: రేవంత్‌రెడ్డి
ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తమపై వేధింపులకు పాల్పడుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విచారణ అనంతరం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారన్నారు.‘ఈ కేసులో హైకోర్టు తీర్పులు ఇచ్చినా కూడా విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయింది. పార్లమెంటు ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీసేం దుకు కుట్ర జరుగుతోంది. చంద్రబాబుకు ఈ కేసులో నోటీసులు ఇస్తారా లేదా అన్నది అధికారులకే తెలుసు. ఈడీ అధికారుల ఇక్కడ విచారణ చేస్తున్నా..వారి గురి ఆ గట్టునే ఉంది.  ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పాను. కేసుతో సంబంధం లేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు.’అని రేవంత్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు