-

కటకటాల్లోకి కామాంధులు 

29 Sep, 2019 06:31 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ

గిరిజన మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్ట్‌ 

రాజీకి యత్నించిన ఎనిమిది మందిపై కేసు  

సాక్షి, పహాడీషరీఫ్‌: గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసులో ఐదుగురు నిందితులను పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో రాజీ చేసేందుకు యత్నించిన మరో ఎనిమిది మందిని కూడా అరెస్ట్‌ చేశారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో  ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌తో కలిసి వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా,  పుర్యనాయక్‌ తండాకు చెందిన మహిళ, కుటుంబంతో సహా బతుకుదెరువు నిమిత్తం నాలుగు నెలల క్రితం నగరానికి వలసవచ్చి హర్షగూడలోని ముచ్చా ప్రశాంత్‌ రెడ్డి అలియాస్‌ ప్రసాద్‌ రెడ్డి పౌల్ట్రీ ఫారంలో పనికి కుదిరారు. సదరు మహిళకు నెలకు రూ.15 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. కాగా సదరు దంపతులు దాణా సంచులను దొంగతనంగా విక్రయించినట్లు తెలియడంతో యజమాని ప్రశాంత్‌ రెడ్డి  ఈ నెల 18న రాత్రి పౌల్ట్రీ ఫారానికి వచ్చాడు. మరో ఫౌల్ట్రీఫారం వద్ద చెల్లా చెదురుగా ఉన్న కాకరెల్స్‌ను వేరు చేయాలని తీసుకెళ్లి ఆమెను గదిలో బంధించి బెల్టు, కర్రలు, పైప్‌లతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం అతనితో పాటు అతని సోదరుడు అనిల్‌ రెడ్డి, చాంద్రాయణగుట్టకు చెందిన భరత్‌(26), అలియాబాద్‌కు చెందిన దేవరశెట్టి పవన్‌ కుమార్, చిక్కింపురి హన్మత్‌ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలోనే బంధించి తీవ్రంగా కొట్టడంతో సురేష్‌ అనే యువకుడికి దాణా సంచులు విక్రయించినట్లు తెలిపారు. దీంతో సురేష్‌ను  తీసుకువచ్చిన వారు చోరీ సొత్తు ఎలా కొంటావంటూ తీవ్రంగా కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ బెదిరించారు.

రాజీకి యత్నం..
బాధిత దంపతులథక్ష పాటు సురేష్‌ ఈ నెల 21న ఫిర్యాదు చేసేందుకు పహాడీషరీఫ్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు సిద్ధపడగా  తుక్కుగూడ, హర్షగూడ ప్రాంతాలకు చెందిన పది మంది పెద్దలు రాజీ చేసేందుకు రంగంలోకి దిగారు. వర్త్య రవీందర్, భవానీ వెంకట్‌ రెడ్డి, జెటావత్‌ రవీందర్, చర్లపల్లి యాదయ్య, జర్పుల రాజు, బేగరీ సురేష్, ఏనుగు లోకేష్, మెగావత్‌ విజయ్‌ కుమార్, జనార్దన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు ప్రశాంత్‌ రెడ్డిని కలిసి బాధితులతో  రాజీ కుదురుస్తామని అందుకు బాధితులకు రూ.2.5 లక్షలు చెల్లించాలని సూచించారు. దీంతో నిందితులు రూ.2.5 లక్షలను వారికి అందజేశారు. దీంతో అదే రోజు  పంచాయతీ ఏర్పాటు చేసిన వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లవద్దని రాజీ కుదుర్చుకున్నట్లు బలవంతంగా బాధితులతో సంతకాలు తీసుకున్నారు. బాధిత దంపతులకు రూ.1.02 లక్షలు, సురేష్‌కు రూ.1.30 లక్షలు ఇచ్చారు. రవీందర్‌ రూ.3 వేలు తీసుకోగా, మిగిలిన రూ.15 వేలతో విందు చేసుకున్నారు.  

ఫిర్యాదుతో వెలుగులోకి
ఈ విషయం తెలియడంతో బాధితుల బంధువులు  పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ధైర్యం చెప్పడంతో ఈ నెల 26న బాధితురాలు పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. రాజీ చేసేందుకు యత్నించిన 10 మందిపై కూడా కేసు నమోదు చేసి శనివారం వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అత్యాచారం కేసు నమోదు చేశామని, ఇందుకు సంబంధించి నివేదికను చార్జిషీట్‌లో జతచేస్తామని ఆయన పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు