అమాయకుడిపై ప్రతాపం.. రంగంలోకి ఉన్నతాధికారులు!

20 Oct, 2017 22:51 IST|Sakshi

నలంద : గ్రామ సర్పంచ్‌ అయి ఉండి తోటి గ్రామస్తుడిని దారుణంగా అవమానిస్తూ శిక్షించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సర్పంచ్‌ సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అసలు వివాదం ఏంటంటే.. బిహార్‌లోని నలంద జిల్లా అజాద్‌పూర్‌లో మహేష్‌ ఠాకూర్‌ అనే వ్యక్తి గత బుధవారం గ్రామ సర్పంచ్‌ దయానంద్ మాంఝీ సన్నిహితుడు సురేంద్ర యాదవ్‌ ఇంటికి వెళ్లాడు. ఎంత పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో ఠాకూర్‌ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తన ఇంట్లోకి వస్తావా నీకెంత ధైర్యమంటూ సురేంద్ర ఈ విషయాన్ని సర్పంచ్ కు చెప్పాడు.

ఇంట్లో ఒంటరి మహిళ ఉన్న సమయంలో ఇంట్లోకి ఎవరు అనమతిస్తే లోపలికి వెళ్లాడో ఠాకూర్‌ చెప్పాలని సర్పంచ్‌ ముందు సురేంద్ర రెచ్చిపోయాడు. వాస్తవానికి ఆ సమయంలో ఇంట్లో చాలామంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సురేంద్రతో సహా సర్పంచ్‌ సహా కుటుంబసభ్యులు ఠాకూర్‌ మీద మండిపడ్డారు. సురేంద్ర పురమాయించడంతో.. సర్పంచ్‌ విధించిన శిక్ష మేరకు తొలుత కొందరు మహిళలు ఠాకూర్‌ను 25 చెప్పు దెబ్బలు కొట్టారు. ఆపై ఇంటి ముందు ఉమ్మేసి ఆ మట్టిని, చెప్పులను నాకాలని హింసించి మరీ బాధితుడి చేత ఆ పని చేయించారు. విషయం వైరల్ కావడంతో నలంద డీఎం ఎస్‌ఎం త్యాగరాజన్‌ స్పందిస్తూ.. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం, సాధ్యమైనంత త్వరగా నిందితులను అరెస్ట్ చేస్తామని నలంద ఎస్పీ సుధీర్‌ కే పొరికా వెల్లడించారు.

మరిన్ని వార్తలు