తోడబుట్టారు.. తోడై వెళ్లారు

10 Jul, 2019 07:38 IST|Sakshi

మరణంలోనూ వీడని బంధం

తమ్ముడి మృతితో ఆగిన అన్న గుండె

రెండు కుటుంబాల్లో విషాదం 

ప్రొద్దుటూరు క్రైం: వారిద్దరూ ఒక తల్లి గర్భాన జన్మించారు.. ఆ తల్లి ఒడిలోనే పెరిగారు.. తమ్ముడంటే అన్నకు ప్రాణం.. అన్నంటే తమ్ముడికి ఎనలేని ప్రేమ.. తమ్ముడికి చిన్న కష్టమొచ్చినా అన్నయ్య భరించలేడు.. దేహాలు వేరైనా వాళ్లిద్దరి గుండె చప్పుడు ఒక్కటే.. పుడుతూ అన్నదమ్ములు.. పెరుగుతూ దాయాదులు అన్న నానుడిని వారు విచ్ఛిన్నం చేస్తూ కలసి మెలసి జీవించారు.. చివరికి మరణంలోనూ ఒకరి వెంట మరొకరిగా ప్రయాణించి తోబుట్టువుల బలీయమైన రక్తసంబంధానికి నిలువెత్తు సాక్షీభూతంగా నిలిచారు. అన్నదమ్ముల అనుబంధం.. అన్యోన్యతను చూసి ఈర్ష్య పడిన భగవంతుడు వాళ్లిద్దరిని తన అక్కున చేర్చుకున్నాడు.

చిన్న నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటూ మరణంలోనూ నిజమైన తోబుట్టువులు అనిపించుకున్న విషాద ఘటన ప్రొద్దుటూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గోపవరం పంచాయతీ, కాల్వకట్ట వీధిలో నివాసం ఉంటున్న ఆవుల చంద్రమోహన్‌ (35) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. తమ్ముడి మరణంతో తీవ్రంగా కలత చెందిన అన్న బాలరాజు (45) మంగళవారం ఉదయం గుండె పోటుతో చనిపోయాడు. ఇద్దరు కాల్వకట్టవీధిలో పక్క పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు.

అనారోగ్యంతో ఆస్పత్రికి..
ఆవుల చంద్రమోహన్‌ బేల్దార్‌ పనికి వెళ్లేవాడు. అతనికి భార్య మరియమ్మ, 11 ఏళ్ల ధరణి అనే కుమార్తె ఉన్నారు. కుమార్తె ఐదో తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి చంద్రమోహన్‌కు ఆరోగ్యం సరిగాలేదు. గుండె సంబంధిత వ్యాధితో పలుమార్లు ఆస్పత్రిలో చూపించుకొని మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి పరిస్థితి విషమంగా మారడంతో ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతను ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని కాల్వకట్ట వీధిలోని అతని ఇంటికి తరలించారు. దూర ప్రాంతాల్లోని బంధువులు రావాల్సి ఉండటంతో మంగళవారం ఉదయం అంత్యక్రియలను నిర్వహించాలని భావించారు. చంద్రమోహన్‌ మరణాన్ని జీర్ణించుకోలేని అన్న బాలరాజు విలపించసాగాడు. రాత్రంతా తమ్ముడినే తలచుకుంటూ సొమ్మసిల్లాడు. కుటుంబ సభ్యులు ఎం త పిలిచినా లేవకుండా అలానే పడిపోయాడు.

గుండె నొప్పిగా ఉందంటూ..
తమ్ముడి మరణంతో కలత చెందిన బాలరాజు మంగళవారం ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ఆయాస పడిన అతను చికిత్స పొందుతూ కొన్ని నిమిషాల్లోనే మృతి చెందాడు. చంద్రమోహన్‌ అంత్యక్రియల కోసం బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున వచ్చారు. ఒకరి కోసం వచ్చిన బంధువులు ఇద్దరి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. బాలరాజు మృతితో భార్య సంజమ్మ విలపిస్తోంది.

వారికి 14 ఏళ్ల అంజలి అనే కుమార్తె ఉంది. ప్రొద్దుటూరులోని వైవీఎస్‌ మున్సిపల్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి, చిన్నాన్న మరణంతో అంజలి రోదిస్తోంది. చిన్న వయసులో తండ్రులను పోగొట్టుకున్న అంజలి, ధరణిలను చూసి స్థానికులు, బంధువులు కంట తడిపెట్టారు. కూలి పని చేసుకొని జీవించే తమకు పెద్ద దిక్కు లేకుండా పోయారని, పిల్లల్ని ఎలా పోషించాలి దేవుడా అంటూ మృతుల భార్యలు విలపిస్తున్నారు.

రెండు కుటుంబాల్లో విషాదం..
చంద్రమోహన్, బాలరాజు మృతితో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం అందరినీ కలచివేసింది. అన్నదమ్ములిద్దరూ రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామంలో సొంత బంధువుల ఇళ్లల్లో పెళ్లి చేసుకున్నారు. వైఎఎస్సార్‌సీపీ నాయకులు దేవీప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓబుళరెడ్డి, శనివారపు సుబ్బరాయుడు తదితరులు విచ్చేసి మృతదేహాలకు నివాళులు అర్పించారు.  

మరిన్ని వార్తలు