కాకినాడలో వృద్ధ దంపతులు హత్య

8 Jun, 2019 09:42 IST|Sakshi

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ముమ్మిడివారి వీధిలో నివాసం ఉంటున్న తుమ్మలపల్లి సత్యానందం (65), మంగతాయారు (62) అనే వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలు..కాకినాడ తిలక్‌ స్ట్రీట్‌లో ఉంటున్న సత్యానందం, మంగతాయారు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె మంజులాదేవి, కుమారుడు మోహన్‌కుమార్‌లు అమెరికాలో ఉంటుండగా మరో కుమార్తె విజయలక్ష్మి బెంగళూరులో ఉంటున్నారు. కాగా, భార్యాభర్తలిద్దరూ గురువారం ఓ ఫంక్షన్‌కు హాజరై అందరితో సంతోషంగా గడిపి తమ ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం శుక్రవారం ఉదయం బంధువులు, స్నేహితులు ఎంతసేపు ఫోన్‌చేసినా స్పందన లేకపోవడంతో సత్యానందం తోడల్లుడు వడుగల వెంకటేశ్వరరావుకు ఫోన్‌చేసి విషయం చెప్పారు. 

దీంతో శుక్రవారం సాయంత్రం ఆయన వచ్చి చూసేసరికి ఇంటి గేటుకు తాళం వేసి,  బయట పాల ప్యాకెట్టు, పేపరు వేసినవి వేసినట్లే ఉన్నాయన్నారు. అనుమానం వచ్చి పక్క మేడపై నుంచి వెళ్లి చూడగా రక్తపు మడుగులో భార్యాభర్తలిద్దరూ పడి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. కొన్ని గంటల ముందు వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపిన వీరు అంతలోనే విగతజీవులుగా మారిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలంలో కొన్ని డాక్యుమెంట్లు కాల్చివేసి ఉండడంతో ఆస్తి తగాదాలు కారణమై ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, బలమైన ఆయుధంతో తలపై కొట్టడంవల్లే వీరు మృతిచెంది ఉంటారని వారు అనుమానిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా