వృద్ధ దంపతుల దారుణహత్య

18 Oct, 2019 08:48 IST|Sakshi
దంపతులు చంద్రేగౌడ, లక్ష్మమ్మ(ఫైల్‌)

ఆస్తి కోసమే ఘాతుకానికి పాల్పడ్డారా?

ఆ కోణంలోనే పోలీసుల దర్యాప్తు

కర్ణాటక, కృష్ణరాజపురం: ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు దారుణహత్యకు గురైన ఘటన గురువారం మహదేవపుర పరిధిలోని గరుడాచార్యపాళ్యలో వెలుగు చూసింది. మండ్య జిల్లా కేఆర్‌ పేటకు చెందిన చంద్రేగౌడ(65),లక్ష్మమ్మ(55) చాలాకాలంగా గరుడాచార్యపాళ్యలో  నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ల క్రితం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగ విరమణ పొందిన చంద్రేగౌడ  చీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. దంపతులకు సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆమెకు ఇటీవల వివాహం చేశారు.దత్త కుమార్తె మినహా ఎవరూ దంపతులను చూడడానికి రాకపోవడంతో ఒం టరిగానే ఉంటున్నారు.ఈ క్రమంలో గురువారం ఇంట్లో నీటి ట్యాంకు నుంచి నీళ్లు పొంగిపొర్లుతున్నా దంపతులు బయటకు రాకపోవడాన్ని గమనించిన ఇంటి పక్కనున్న వ్యక్తులు కిటికీలోనుంచి చూడగా వారు హత్యకు గురైనట్లు వెలుగుచూసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. 

దంపతుల  ఒంటిపై నగలు అలాగే ఉండడం, ఇంట్లోని విలువైన వస్తువులు, నగదు,నగలు  చోరీకి గురి కాకపోవడం, బీరువాలో పత్రాల కోసం వెతికినట్లు ఆధారాలు లభించడంతో ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చంద్రేగౌడ ఉంటున్నది   సొంతిల్లు కావడం, పైగా ఇంటిపై కట్టిన ఇళ్ల నుంచి ప్రతినెలా వేలాది రూపాయలు అద్దెలు వస్తుండడం, సొంతూరులో కూడా బాగానే ఆస్తులు ఉండడం, చీరల వ్యాపారంలో కూడా ఆదాయం బాగానే ఉన్నట్లు గమనించిన బంధువులు ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.  నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావు, వైట్‌ఫీల్డ్‌ డీసీపీ అనుచేత్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు