శ్రద్ధగా యోగా చేస్తున్నాడు.. ఇంతలో..

18 Feb, 2019 07:10 IST|Sakshi

పర్లాకిమిడి : స్థానిక రాంనగర్‌ హైటెక్‌ ప్లాజాలో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న యోగా శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. యోగా గురువు రాందేవ్‌బాబా శిష్యులు స్వామి ఓం దేవ్‌జీ విచ్చేశారు. హైటెక్‌ ప్లాజా అధినేత తిరుపతి పాణిగ్రాహి, యోగా గురువులు అంబియా రంజన్‌ పాణిగ్రాహి, భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్టు విఘ్నేశ్వర దాస్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ యోగా శిబిరంలో అపశృతి చోటుచేసుకుంది. యోగా చేస్తుండగా ఉన్నట్టుండి 78 ఏళ్ల వృద్ధుడు కుప్పకూలిపోయాడు. ప్రాణవాయువు ఆడక చతికిలపడ్డాడు. యోగా శిబిరంలో ఉన్న ఏడీఎంఓ డాక్టర్‌ లోక్‌నాథ రాజు ప్రాథమిక చికిత్స చేశారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టు నిర్ధారించారు.

అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను వెంటనే పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్‌ సురేంద్ర రోధో ఆయనకు ఈసీజీ తీసినా ఫలితం లేకపోవడంతో  ఆయన గుండె పోటుతో మృతి చెందినట్టు డాక్టర్‌ రోధో తెలియజేశారు. అయితే మృతుని పేరు, ఊరు తెలియకపోవడంతో మధ్యాహ్నం వరకూ మార్చురీలో మృతదేహాన్ని ఉంచి పోలీసులకు సమాచారం అందజేశారు. అయితే మృతుడు రాయఘడ బ్లాక్‌కు చెందిన సేవక్‌ పూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తిగా కొందరు గుర్తించారు. ఈయన చిరునామా, మొబైల్‌ కాంటాక్టు ఇంతవరకూ లభించలేదని పతాంజలి యోగా శిబిరం నిర్వాహకులు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు