ఆ బంధమే ఆయువు తీసింది!

1 Aug, 2018 12:21 IST|Sakshi
నిందితులను కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు

వీడిన నారాయణప్ప హత్య మిస్టరీ

కాల్‌ డేటా ఆధారంగా నిందితుల గుర్తింపు

ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

కదిరి: వివాహేతర సంబంధం వృద్ధుడి ప్రాణం తీసింది. ప్రియురాలు, ఆమెతో సహజీవనం సాగిస్తున్న వ్యక్తి నిందితులని విచారణలో తేలింది. ఈ మేరకు ఇద్దరు నిందితులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీలక్ష్మీ మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి మండలం ముసలివేడుకు చెందిన మునిలక్ష్మీ అలియాస్‌ ధనలక్ష్మీ అలియాస్‌ లక్ష్మీ, నారాయణవనం మండలం కన్యకాపురానికి చెందిన టి.బాలాజి అలియాస్‌ బాలకృష్ణ సహజీవనం సాగిస్తున్నారు.

వీరు నన్నారి వేర్లు అమ్ముకుంటూ సంచార జీవనం చేసేవారు. అందులో భాగంగా అనంతపురం జిల్లా తనకల్లు మండలం సున్నంపల్లి దగ్గర తాత్కాలికంగా కాపురం ఉంటున్నారు. మునిలక్ష్మీకి సున్నంపల్లికి చెందిన జెరిపిటి నారాయణప్ప (70)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. సహజీవనం చేస్తున్న బాలాజీకి ఈ విషయం తెలిసింది. దీంతో నారాయణప్పను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. నెల రోజుల కిందట మునిలక్ష్మీ ద్వారా నారాయణప్పను ఇద్దరూ కలిసి హత్య చేశారు. అనంతరం తమపై అనుమానం రాకుండా ఉండేందుకు కదిరి మండలం అలంపూర్‌ అడవుల్లోకి శవాన్ని తీసుకెళ్లి కాల్చేశారు.

నిందితులను గుర్తించిందిలా..
అలంపూర్‌ అటవీ ప్రాంతంలో అస్తి పంజరం పడి ఉందని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కదిరి రూరల్‌ పోలీసులు కేసు(క్రైంనెం45/2018) నమోదు చేశారు. ఈ కేసును డీఎస్పీ శ్రీలక్ష్మీ సీరియస్‌గా తీసుకున్నారు. దర్యాప్తు బాధ్యతలను పట్టణ సీఐ గోరంట్ల  మాధవ్‌కు అప్పగించారు. ఆయన కదిరి రూరల్‌ ఎస్‌ఐ వెంకటస్వామితో కలిసి విచారణ మొదలెట్టారు. మృతుడు నారాయణప్ప సెల్‌కు ఎవరి నుంచి ఎక్కువగా కాల్స్‌ వస్తున్నాయి.. చనిపోవటానికి ముందు ఎవరు ఫోన్‌ చేశారో ఆరా తీశారు. నారాయణప్ప హత్య కేసులో మునిలక్ష్మీ, బాలాజీలే నిందితులని విచారణలో తేలింది. వారిని పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న నిందితులిద్దరూ వెంటనే తహసీల్దార్‌ను కలిసి తామే నారాయణప్పను చంపామని ఒప్పుకున్నారు. పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారు.

మరిన్ని వార్తలు