సెలవు ఇవ్వలేదని ఇంజినీర్‌ ఆత్మహత్య

10 Dec, 2018 10:57 IST|Sakshi
సూసైడ్‌నోట్, ఆత్మహత్య చేసుకున్న ధనపాలన్‌

అన్నానగర్‌: పళణిలో అధికారి సెలవు ఇవ్వలేదనే మనస్తాపంతో శనివారం విద్యుత్‌శాఖ సహాయ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రామనాథపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమీపంలోని అపార్టుమెంట్‌కి చెందిన ధనపాలన్‌ (57). ఇతను దిండుక్కల్‌ జిల్లా పళణి సమీపం ఆయక్కుడి విద్యుత్‌శాఖ కార్యాలయంలో సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం పళణి రైల్వేపీటర్‌ రోడ్డు వద్ద ఉన్న పెరియాత్తా కాలనీలో ఓ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం ధనపాలన్‌ ఎప్పటిలాగే పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. తరువాత అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ధనఫాలన్‌ను చూడడానికి అక్కడికి వచ్చాడు. అప్పుడు లోపలి భాగం తలుపులు మూసి కనిపించాయి.

అతను చాలాసేపు తలుపులు తట్టినా ధనపాలన్‌ తెరవలేదు. అనుమానంతో ఆ వ్యక్తి కిటికీలో నుంచి లోపలికి చూడగా.. ధనపాలన్‌ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో పళణినగర్‌ పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పళణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధనపాలన్‌ నివసిస్తున్న ఇంటిని పరిశీలించగా అతను రాసిన లేఖ లభించింది. అందులో ‘ప్రియమైన అమ్మ. నేను మీ దుఃఖ కార్యక్రమానికి రాలేకపోతున్నాను. నా పై అధికారి సెలవు ఇవ్వడంలేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసి ఉంది. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు