స్వీపర్‌కు విద్యుత్‌ శాఖ ఏఏవో వేధింపులు

15 Nov, 2017 10:58 IST|Sakshi

సీఎండీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు

విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు విద్యుత్‌ శాఖ అధికారుల్లో తీవ్ర కలకలం

సత్తెనపల్లి: స్వీపర్‌పై విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఏఏవో) వేధింపులకు పాల్పడుతున్న వైనంపై బాధితురాలు తిరుపతి ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ దొరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు చేసిన లేఖ ప్రస్తుతం విద్యుత్‌ శాఖ ఉద్యోగుల సెల్‌ఫోన్లలోని వాట్సప్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. వివరాలు ఇలా... పట్టణంలోని విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా పని చేస్తూ రమేష్‌ నాయక్‌ మృతి చెందాడు. దీంతో ఆయన భార్యకు పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల ఈఆర్వో కార్యాలయంలో స్వీపర్‌గా ఏడాదిన్నర క్రితం ఉద్యోగమిచ్చారు. కార్యాలయంలో ఏఏవోగా పని చేస్తున్న విశ్వేశ్వరరెడ్డి ఎనిమిది నెలలుగా తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

మార్చి 2017 నుంచి కార్యాలయం సమయం దాటిన తరువాత ఫోన్‌ చేస్తూ అభ్యకరంగా మాట్లాడుతున్న చెప్పింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని పేర్కొంది. ఈ నెల 3న సాయంత్రం 4.30 గంటలకు జేఏవో అనుమతి తీసుకుని ఇంటికి వెళ్లినా మరుసటి రోజు వేధింపులకు గురి చేశాడని తెలిపింది. ఏఏవోతో తనకు ప్రాణ హాని ఉంటుందని ఎనిమిది నెలలుగా వేధింపులు భరించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఓపిక పట్టలేక ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆయన జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడి విచారణ నిమిత్తం ఇద్దరు ఉన్నతాధికారులను నియ మించారు. అధికారులు మంగళవారం సత్తెనపల్లి చేరుకుని ఏఏవో విచారణ చేపట్టారు. తొలుత బాధితురాలిని విచారించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. మరో వైపు స్వీపర్‌తో రాజీ చేసేందుకు కొందరు ఉద్యోగులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. జరిగిందేదో జరిగింది ఇకపై నీ జోలికి రాకుండా చూస్తామని, ఫిర్యాదును వాపస్‌ తీసుకోవాలని కోరుతున్నారు. కాగా రాజీ చర్చలు ఫలించలేదు. ఈ వ్యవహారం విద్యుత్‌ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. 

మరిన్ని వార్తలు