ఏనుగు దాడిలో భక్తుడు మృతి

15 Apr, 2019 20:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై : ఆలయానికి తీర్థం (జలం) తీసుకురావడానికి వెళ్లిన సమయంలో అడవి ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తిరుపూర్‌ జిల్లా పల్లడం సమీపంలో ఉన్న సెంజేరిమలై, పురాండం పాళయంలో మదురై వీరన్‌ ఆలయం ఉంది.  ఉత్సవాలను పురస్కరించుకుని తీర్థం తీసుకురావడానికి భక్తులు 10 మంది శనివారం రాత్రి వాహనం మూలంగా పూండి వెల్లియంగిరి ఆండవర్‌ ఆలయానికి వచ్చారు. ఆదివారం ఉదయం ఆరు గంట సమయంలో వెల్లియకుడి కొండదిగువ భాగంలో ఉన్న మామరత్తు కండి అటవీ ప్రాంతంలో ఉన్న నొయ్యల్‌ నదిలో నీరు తీసుకురావడానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ దాగి ఉన్న ఒంటరిగా తిరుగుతున్న అటవీ ఏనుగు వారిని చూసి వెంట పడటంతో 10 మంది భక్తులు భీతి చెంది నలు దిక్కులకు పరిగెత్తారు. ఇందులో ముగ్గురు ఏనుగుకు చిక్కారు.

వారిని ఏనుగు తొండంతో దాడి చేసి పైకి ఎత్తి విసిరి పడేసింది. ఇది చూసిన తక్కిన ఏడుగురు శబ్దం చేశారు. దీంతో ఏనుగు ముగ్గురిని వదలి ఏడుగురిని తరుముకుంటూ పరిగెత్తింది. దీంతో ప్రాణం అరచేతిలో పట్టుకుని పరిగెత్తిన ఏడుగురు ముల్లంకాడు చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని తరువాత అటవీశాఖ ఉద్యోగులు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి చూశారు. అక్కడ ఒకరు మృతి చెంది ఉండగా మరో ఇద్దరు తీవ్ర గాయంతో ప్రాణాలకు పోరాడుతున్నారు. దీంతో ఇద్దరిని చికిత్స కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు విచారణలో మృతి చెందిన వారు పురాండం పాళయంకు చెందిన ఆరుస్వామి (60) అని తెలిసింది. తీవ్ర గాయమైన వారు అదే ప్రాంతానికి చెందిన దురైస్వామి (60), శివానందం (63) అని తెలిసింది.

మరిన్ని వార్తలు