కాటి నాగరాజు హత్య కేసులో సంచలన నిజాలు

5 Nov, 2019 17:16 IST|Sakshi
కాటి నాగరాజు, పీఈటీ (ఫైల్‌)

గత నెల 16న హత్యకు గురైన కాటి నాగరాజు

పశ్చిమ గోదావరి: ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య ఉదంతంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత నెల 16న హత్యకు గురైన కాటి నాగరాజు హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఏలూరుకు చెందిన వెల్లంకి సింహాద్రి ప్రసాదంలో సైనైడ్ కలిపి నాగరాజును హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణ సందర్భంగా సింహాద్రి చేసిన అనేక ఆకృత్యాలను పోలీసులు కనుగొన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో మొత్తం 10 మందికి సైనైడ్ కలిపిన ప్రసాదం పెట్టి అతను హతమార్చినట్లు విచారణలో తేలింది.

సింహాద్రితో పాటు సైనైడ్ సరఫరా చేసిన విజయవాడ కు చెందిన షేక్ అమీనుల్లా ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని బంధువులను, కుటుంబ సభ్యులను కూడా నిందితుడు హతమార్చినట్లు తెలిపిన జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ వెల్లడించారు. రంగు రాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపు, రైస్ పుల్లింగ్ వంటి మోసాలతో మొత్తం 28 లక్షల 50 వేలు వరకు కాజేసినట్లు తెలిసింది. నిందితుని వద్ద నుండి సైనైడ్, 23 కాసుల బంగారం, లక్షా 63 వేల 400 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండివ్యాయామ ఉపాధ్యాయుడి హత్య!


ఏం జరిగింది.. 
అక్టోబర్‌ 18న రూ.2 లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని కాటి నాగరాజు మోటారు సైకిల్‌పై  బయలుదేరారు. బంగారు ఆభరణాలు ఎందుకు తీసుకువెళుతున్నారని తాను అడిగితే ఎల్‌ఐసీ వాళ్లు స్కాన్‌ చేసుకుని ఇస్తారని చెప్పి తీసుకువెళ్లినట్లు అతడి భార్య తెలిపింది. అదేరోజు రాత్రి వట్లూరు పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన నాగరాజు అచేతనంగా పడి ఉన్నారు. అటుగా విజయవాడ నుంచి వస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఆయన్ను గమనించారు. నాగరాజుతో పరిచయం ఉండటంతో విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యుల సాయంతో నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు నిర్ధారించారు. ఆయన హత్య చేసి ఎవరైనా సొత్తు అపహరించుకుపోయారా లేక అనారోగ్యంతో ఆయన మృతి చెందారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత నాగరాజు గుండెపోటులో మృతిచెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువెళ్లగా నగదు, నగలు ఆయన వద్ద లేకపోవటాన్ని గుర్తించి ఎవరైనా హత్యచేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు