దొంగనోట్ల ముఠా అరెస్ట్‌

8 Sep, 2019 12:16 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ ఐశ్వర్యరస్తోగి

రూ.34.19 లక్షల విలువైన నోట్ల స్వాధీనం

నిందితులంతా పాత నేరస్తులే

ఇప్పటికే రూ.9 లక్షలు చలామణి చేసిన వైనం  

సాక్షి, నెల్లూరు (క్రైమ్‌): ఏలూరు–జంగారెడ్డిగూడెం రోడ్డు కేంద్రంగా దొంగనోట్లను ముద్రించి వాటిని చలామణి చేస్తున్న ముఠాను నెల్లూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.34.19 లక్షలు విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ముఠా వివరాలను వెల్లడించారు. ఏలూరుకు చెందిన పి.మురళి అలియాస్‌ మురళీకృష్ణ పాత నేరస్తుడు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంది. గతంలో దొంగనోట్లను తయారు చేసి చెలామణి చేస్తుండగా గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. నెలన్నర క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన అతను తిరిగి దొంగనోట్ల తయారీకి తెరలేపాడు.

కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన సంధ్యపోగు రాములు అలియాస్‌ ఆదాం, నెల్లూరు నగరంలోని వనంతోపుసెంటర్‌కు చెందిన కాకు శ్రీను అలియాస్‌ శ్రీనివాసులు, గుంటూరు జిల్లా తెనాలి పట్టణం రాధా టాకీస్‌ సెంటర్‌ ప్రాంతానికి చెందిన కానికిచెర్ల నరేంద్రకుమార్, తెనాలి మండలం రావూరు గ్రామానికి చెందిన కె.రవికుమార్, చుండూరు మండలం మోదుకూరి గ్రామానికి చెందిన ఆర్‌.విద్యాకుమార్‌ అలియాస్‌ విద్యాసాగర్, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం ఈపూరుపాళేనికి చెందిన ఎ.సునీత, రాజస్థాన్‌ రాష్ట్రం, బాదమురు జిల్లా గడ్డాడారోడ్, జనకలై గ్రామానికి చెందిన ప్రేమదాస్‌లను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారు. వీరందరూ నేరచరిత్ర కలిగిన వారే.

 గది అద్దెకు తీసుకుని..
మురళీకృష్ణ తనకున్న కంప్యూటర్‌ పరిజ్ఞానంతో దొంగనోట్లను ముద్రించేందుకు అవసరమైన కంప్యూటర్‌లు, ప్రింటర్లు, స్కానర్లు, ఆర్‌బీఐ మార్కు కలిగిన స్టిక్కర్లను ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం ఏలూరు పట్టణంలో ఓ గదిని అద్దెకు తీసుకుని రూ.45 లక్షల దొంగనోట్లను ముద్రించాడు. వాటిని ముఠాలోని సభ్యులకు ఇచ్చాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రొయ్యల వ్యాపారస్తులకు వాటిని చలామణి చేయాలని నిర్ణయించుకుని మురళీ, రాములు, కాకు శ్రీని, మౌలాలీలు ఈనెల 5వ తేదీ ఇందుకూరుపేట యార్లగడ్డ సెంటర్‌ వద్ద దొంగనోట్లను మార్చేందుకు యత్నించసాగారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్‌ నేతృత్వంలో నెల్లూరు రూరల్‌ సీఐ కె.రామకృష్ణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వారిచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఏలూరులో దొంగనోట్లు ముద్రించే పరికరాలతో పాటు ముఠాలోని నరేంద్రకుమార్, విద్యాసాగర్‌ సునీత, ప్రేమదాస్‌లను అరెస్ట్‌ చేశారు. నిందితులు సుమారు నెలరోజుల వ్యవధిలో రూ.9 లక్షల దొంగనోట్లను చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా రూ.లక్షకు రూ.25 వేలు కమీషన్‌ చొప్పున నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే సూరత్‌ నుంచి ఓ వ్యాపారి రూ.200 దొంగనోట్లు రూ.4 లక్షలు కావాలని నిందితులను కోరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేవలం మూడురోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠా ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.శ్రీనివాసన్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.     సంధ్యపోగు రాములు అలియాస్‌ ఆదాంపై అనేక జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు