బాస్‌కే సైబర్‌ వేధింపులు!

7 Feb, 2020 10:44 IST|Sakshi

అశ్లీల చిత్రాలు ఈ–మెయిల్‌ చేసిన ఉద్యోగి

నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: వర్క్‌ ప్లేస్‌ హెరాస్‌మెంట్‌లో ఇదో కొత్త కోణం. సాధారణంగా తమ కింద పని చేసే మహిళల్ని వేధించే బాస్‌ల వ్యవహారాలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అయితే తన బాస్‌ అయిన ఓ మహిళను ఈ–మెయిల్స్‌ ద్వారా వేధించాడో ఉద్యోగి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బండ్లగూడకు చెందిన ఇ.లక్ష్మీకాంత్‌ను నిందితుడిగా గుర్తించి గురువారం అరెస్టు చేశారు.  కర్నూలు జిల్లాకు చెందిన ఇ.లక్ష్మీకాంత్‌ రాజేంద్రనగర్‌ సమీపంలోని బండ్లగూడలో స్థిరపడ్డాడు. వివాహితుడైన ఇతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  న్యూ బోయిన్‌పల్లి ప్రాంతంలో ఉన్న ఓ లేడీస్‌ గార్మెంట్స్‌ డిజైనింగ్‌ సంస్థలో పని చేస్తున్నాడు.

ఈ సంస్థను అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ నిర్వహిస్తున్నారు. లక్ష్మీకాంత్‌ ‘యువర్‌ మై బెస్ట్‌ లవర్‌’ పేరుతో జీమెయిల్‌ ఖాతా తెరిచాడు. దీన్ని వినియోగించి కొన్నాళ్ళుగా తన యజమానికే ప్రేమ సందేశాలు పంపిస్తున్నాడు.  ఇది పోకిరీల పనిగా భావించిన ఆమె విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే వ్యవహారం శృతిమించి కొన్ని రోజుల నుంచి అశ్లీల చిత్రాలను ఈ–మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆమె సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌ సాంకేతికంగా దర్యాప్తు చేశారు. ఈ–మెయిల్‌ ఐడీతో పాటు ఇతర అంశాల ఆధారంగా సదరు మహిళ వద్ద పని చేస్తున్న లక్ష్మీకాంతే నిందితుడిగా గుర్తించారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. ఆ మెయిల్స్‌ను నగరంలోని ఓ ఇంటర్‌నెట్‌ కేఫ్‌ నుంచి పంపినట్లు బయటపెట్టాడు.

మరిన్ని వార్తలు