ఆగని తుపాకుల మోత! 

24 Sep, 2019 10:58 IST|Sakshi
ఆదివారం ఎన్‌కౌంటర్‌ సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న తుపాకులు

24 గంటలు గడవక ముందే మరో ఎన్‌కౌంటర్‌

మావోయిస్టు ప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ కూంబింగ్‌ 

విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఆదివారం పోలీసులు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించి 24 గంటలు గడవకముందే మరో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. జీకే వీధి మండలం మాదిగమళ్లు అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎదురుకాల్పులు జరిగి ముగ్గురు మావోయిస్టులు చనిపోగా.. సంఘటన స్థలంలో ఐదు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మృతదేహాలను సోమవారం రాత్రి 8 గంటలకు నర్సీపట్నం తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. అదే సమయంలో మాదిగమళ్లు సమీప పేములమల్లు అటవీ ప్రాంతంలో మళ్లీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మూడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్, నాటు తుపాకీ ఉన్నాయి.

సాక్షి, సీలేరు(విశాఖపట్టణం) : ఏజెన్సీలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులే లక్ష్యంగా అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్‌ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తమకు మావోయిస్టులు తారసపడడంతో తాజా ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుందని పోలీసులు అంటున్నారు. సంఘటన స్థలంలో ఏకే 47 ఉండడంతో మావోయిస్టుల అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అన్నది పోలీసు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయం కావడంతో మృతులు ఎవరన్నది గుర్తించడం కష్టంగా ఉంది. ప్రస్తుతం రెండు ఎన్‌కౌంటర్లతో ఈ ప్రాంత మంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. గిరిజనులంతా భయంతో వణుకుతున్నారు. ఇళ్లల్లోంచి భయటకు రాని పరిస్థితి నెలకొంది. 

ప్రతిఘటన తీర్చుకున్న బలగాలు..
విశాఖ ఏజెన్సీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేస్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమలను మావోయిస్టులు దారికాచి కాల్చి చంపిన సంఘటనకు సోమవారంతో ఏడాది కావచ్చింది. ఈ నేపథ్యంలో బలగాలు ఈ రెండు ఎన్‌కౌంటర్లతో ప్రతిఘటన తీర్చుకున్నామని ఆనందంలో ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత అరుణ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన సంఘటనలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆమెనే టార్గట్‌ చేసుకొని బలగాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 20 రోజులుగా అరుణ ఉన్న దళాన్నే టార్గట్‌ చేసి కూంబింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికీ రెండుసార్లు ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎలాగైనా పోలీసులు ఆమెను పట్టుకునేటట్లు కూంబింగ్‌ నిర్వహిస్తూ ఏడాది రోజున ఈ రెండు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులను హతమార్చి ఆ పార్టీకి గట్టి దెబ్బ కొట్టారు. కాగా ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వీరు ఛత్తీస్‌గఢ్‌కి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిని బుధ్రి, విమల, అజయ్‌గా గుర్తించారు.

మరిన్ని వార్తలు