వనీ బ్రిగేడ్‌లో ఆఖరి కమాండర్‌ హతం

6 May, 2018 12:54 IST|Sakshi
సద్దాం పద్దర్‌ (ఫైల్‌ ఫొటో)

శ్రీనగర్‌, జమ్మూ కశ్మీర్‌ : హిజ్బుల్‌ మొజాహిదీన్‌(ఐఎమ్‌) ప్రముఖ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ బ్రిగేడ్‌లోని ఆఖరి కమాండర్‌ను భారత భద్రతా దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. ఇప్పటికే పలువురు కీలక కమాండర్‌లను భద్రతా బలగాలు మట్టుబెట్టగా.. షోపియాన్‌ జిల్లాలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్‌ వనీ బ్రిగేడ్‌లో ఆఖరివాడైన సద్దాం పద్దర్‌ మృతి చెందిన్నట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. షోపియాన్‌లో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య ఆదివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. జైనాపుర ప్రాంతంలోని బడిగాం గ్రామంలో ఉగ్రవాదులు నక్కారనే సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ గ్రామాన్ని చుట్టుముట్టాయి. తీవ్రవాదుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు కార్డన్‌ సెర్ఛ్‌ ఆపరేషన్‌ చేపట్టగా.. భద్రతా బలగాల రాకను గమనించిన మిలిటెంట్లు కాల్పులకు దిగారు.

ప్రతిగా రక్షక దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. కాగా, ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను, పోలీసు అధికారి గాయపడ్డారు. కొంత కాలంగా తీవ్రవాద సంస్థలో పని చేస్తున్న కశ్మీర్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మహ్మర్‌ రఫి బట్‌ కూడా ఈ కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మిగతా ముగ్గురిని గుర్తించాల్సివుందని పోలీసులు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు