దేవదాయశాఖ ఈవో అనిత ఆత్మహత్య

25 Nov, 2019 11:38 IST|Sakshi

మూడు రోజుల కిందటే సస్పెన్షన్‌

గుంటూరు జిల్లాలో ఘటన 

సాక్షి, దాచేపల్లి (గురజాల): రెండు రోజుల కిందట సస్పెండైన దేవదాయశాఖ గురజాల మండల ఈవో డి.అనిత (32) కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీటిలో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బయటికి తీయించిన ఎస్‌ఐ ఇ.బాలనాగిరెడ్డి.. మృతురాలు అనితగా గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిత భర్త రమేష్‌ గుంటూరులో ఉంటూ న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అనిత గురజాలలో విధులు నిర్వర్తిస్తూ దాచేపల్లి మండలం శ్రీనగర్‌లో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం ఉదయం భర్త వద్ద నుంచి ఇంటికి బయలుదేరినట్టు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. బస్సులో ఉన్నప్పుడు పలుమార్లు భర్తతో కూడా మాట్లాడారు. దాచేపల్లి బస్టాండ్‌లో దిగానని 9 గంటలకు ఫోన్‌ చేసి.. మధ్యాహ్నం 12 గంటలైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బస్టాండ్, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. 

అంతలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడినట్టు వారికి సమాచారం అందింది. 2016లో కృష్ణా పుష్కరాల సందర్భంగా గురజాల మండలం దైద, సత్రశాల ఘాట్‌ల నిర్వహణ బాధ్యతలను అనిత చూశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల అండదండలతో నిధుల దుర్వినియోగం జరిగిందని.. త్రిసభ్య కమిటీ విచారణలో అది వాస్తవమని తేలడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్‌ చేశారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెప్పుకొంటున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.  

>
మరిన్ని వార్తలు