‘క్యూనెట్‌’పై ఈడీ

28 Aug, 2019 02:05 IST|Sakshi
మీడియాతో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌

నిందితులు, ప్రముఖులను విచారణకు పిలిచే అవకాశం..

అక్రమాస్తుల చిట్టా తవ్వనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

ఇప్పటికే కేసు వివరాలను సమర్పించిన సైబరాబాద్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో అమాయకులను రూ. వేల కోట్లకు బురిడీ కొట్టించిన క్యూనెట్‌ సంస్థపై నమోదైన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) త్వరలో రంగంలోకి దిగ నుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును విదేశాలకు తరలించిం దన్న ఆరోపణలపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తు ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ పోలీసులు మొత్తం అందజేసినట్లు సమాచారం. వాటి ఆధారంగానే త్వర లోనే ఈడీ అధికారులు ఈ కేసులో నేరుగా రంగంలోకి దిగను న్నారు. 

క్యూనెట్‌ సంస్థ వేలాది మంది బాధి తుల నుంచి వసూలు చేసిన  కోట్లాది రూపాయలను విదేశాలకు ఎలా తరలిం చారు? ఎవరి సాయం తీసుకున్నారు? ఎంత మొత్తాన్ని విదేశాలకు చేరవేశారు? అక్కడ ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా? దేశంలోనూ పలు చోట్ల వీరు ఆస్తులు కూడబెట్టారా? వంటి విషయాలపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు సంబంధించి మొత్తం 38 కేసులు నమోదవగా 70 మందిని అరెస్టు చేశారు. వారిలో కీలకమైన 12 మంది వ్యక్తులు పారిపోకుండా ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉండి రూ. కోట్లు కాజేసిన వ్యక్తులు, ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనున్నారని తెలిసింది. అయితే దీనిపై ఇపుడే ఏమీ చెప్పలేమని ఓ అధికారి తెలిపారు.

ఐదేళ్ల కిందటే క్యూనెట్‌ అక్రమ దందా..!
క్యూ గ్రూప్‌ (హాంకాంగ్‌)కు చెందిన విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ’క్యూనెట్‌’పేరిట భారత్‌లో జరుపుతున్న ఈ మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ దందాలో దాదాపు రూ. 5000 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. జనవరిలో హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ దందాకు సంబంధంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి ఐదేళ్ల కిందటే మహారాష్ట్రలో క్యూనెట్‌ అక్రమాలపై తొలుత కేసులు నమోదయ్యాయి.

మల్టీలెవల్‌ సంస్థల్లో ఎవరూ చేరొద్దు: సజ్జనార్‌
క్యూనెట్‌ అనుబంధ సంస్థ విహన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను మూసివేసే దిశగా కేంద్ర కార్పొరేట్‌ వ్యవహరాలశాఖ చర్యలు చేపట్టిందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ కంపెనీ సహా మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ సంస్థల్లో ఎవరూ సభ్యులుగా చేరవద్దని సూచించారు. విహన్‌ సంస్థలో ఇప్పటికే చేరిన వారు ప్రమోటర్లకు డబ్బు చెల్లించవద్దని, అలా చేస్తే వారే నష్టపోతారని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ చేపట్టిన చర్యలను వివరించడంతోపాటు ప్రజలను ఎంఎల్‌ఎం మోసాలపై జాగృతపరిచేలా సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సజ్జనార్‌ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

ఈ కంపెనీ బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న రూ. 2.7 కోట్లను ఫ్రీజ్‌ చేశామని, బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించిన సెలబ్రిటీలు అనిల్‌ కపూర్, షారూఖ్‌ఖాన్, బొమన్‌ ఇరానీ, జాకీష్రాఫ్, వివేక్‌ ఒబెరాయ్, పూజా హెగ్డే, అల్లు శిరీష్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు. అనిల్‌ కపూర్, షారూఖ్‌ఖాన్, బొమన్‌ ఇరానీలు వారి అడ్వొకేట్ల ద్వారా బదులిచ్చారని, మిగతా వాళ్ల నుంచి ఇంకా సమాధానం రాలేదన్నారు. వారితోపాటు మొదటి 500 ప్రమోటర్లకు కూడా నోటీసులు జారీ చేసినా సమాధానాలు రాలేదని సజ్జనార్‌ చెప్పారు. బాధితుల ఫిర్యాదులతో కేంద్రం సైతం ఈ సంస్థపై దర్యాప్తు చేపట్టాలని సౌత్‌ ఈస్ట్‌ రీజియన్‌ హైదరాబాద్‌ ఆర్‌వోసీని గతంలోనే ఆదేశించిందన్నారు. ఆర్‌వోసీ నివేదిక ఆధారంగా ఆ కంపెనీని మూసేయాలని బెంగళూరు ఆర్‌వోసీని ఆదేశించడంతోపాటు ఈ కంపెనీకి అనుబంధంగా ఉన్న 12 మందిపై లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేసిందని సజ్జనార్‌ వివరించారు. ఇందుకు సంబంధించిన కాపీని ఆయన మీడియాకు చూపించారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఎకనామిక్‌ ఆఫెన్స్‌ వింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు