వాద్రా సంబంధీకులపై ఈడీ దాడులు

8 Dec, 2018 02:19 IST|Sakshi
రాబర్ట్‌ వాద్రా

రక్షణ కొనుగోళ్లలో కమీషన్ల వ్యవహారంలో చర్యలు

ఢిల్లీ, బెంగళూరుల్లోని వేర్వేరు చోట్ల సోదాలు

న్యూఢిల్లీ: రక్షణ ఒప్పందాల్లో కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బావ రాబర్ట్‌ వాద్రా సంబంధీకుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరులోని పలుచోట్ల శుక్రవారం ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. వాద్రా, మరో వ్యక్తికి చెందిన సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ కొనుగోళ్ల ఒప్పందాల్లో వారు కమీషన్లు తీసుకున్నట్లు అనుమానిస్తున్నామని, ఆ డబ్బుతో వారు విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. వారి ఇళ్లల్లోనే సోదాలు జరపడానికి తగిన సాక్ష్యాలు సేకరించినట్లు చెప్పారు. అయితే ఎవరి ఇళ్లపై దాడులు జరిపినదీ, ఏ రక్షణ ఒప్పందం కింద ఈ చర్యలు తీసుకున్నదీ వెల్లడించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్‌ మైకేల్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించిన నాలుగు రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మోదీకి ఓటమి భయం: కాంగ్రెస్‌
తాజా సోదాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మోదీ..వాద్రాపై రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని తేల్చిచెప్పింది. వాద్రా లాయర్‌ జ్యోతి ఖైతాన్‌ కూడా ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. సెర్చ్‌ వారంట్లు లేకుండానే ఈడీ అధికారులు వాద్రా సంబంధీకుల ఇళ్లలోకి ప్రవేశించి లోపలి నుంచి తాళం వేశారని ఆరోపించారు. ఈ చర్య వెనక ప్రభుత్వ పాత్ర ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. లేని సాక్ష్యాల్ని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు