ఇంజినీరింగ్‌ విద్యార్థి బలవన్మరణం

22 Jan, 2018 08:21 IST|Sakshi

 హోటల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెందానంటూ లేఖ

మృతుడు నరసరావుపేట నివాసి

ఏలూరు టౌన్‌ (పశ్చిమగోదావరి) : ఏలూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. సర్‌ సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న మోతుకూరి సాయి వెంకట వంశీకృష్ణ (20) స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని గ్రాండ్‌ ఆర్యా హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నుంచి గది తలుపులు తెరవకపోవటంతో హోటల్‌ నిర్వాహకులు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. త్రీటౌన్‌ పోలీసులు ఆదివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో గది తలుపులు తెరిచి చూడగా.. నైలాన్‌ వైరుతో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలియటంతో సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు భారీసంఖ్యలో హోటల్‌ వద్దకు చేరుకున్నారు. ఏలూరు త్రీటౌన్‌ సీఐ పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఏ.పైడిబాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.  వంశీకృష్ణ సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి మరీ ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. అతడి స్వస్థలం కడప జిల్లా ఒంటిమిట్ట కాగా ప్రస్తుతం గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉంటున్నారు. తండ్రి పార్థసారథి ప్రభుత్వ శాఖలో ఇంజినీర్‌గా పనిచేశారు. తల్లి కొంతకాలం క్రితమే మరణించగా, తండ్రి రోడ్డు ప్రమాదం కారణంగా ఇంటి వద్దనే ఉంటున్నట్టు తెలుస్తోంది. చదువులోనూ వెనుకబడి ఉంటా డని, కొందరి వద్ద అప్పులు సైతం చేసినట్లు, జల్సాలకు అలవాటు పడినట్లు తెలుస్తోంది. అయితే, ఇవే కారణాలా... ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు రోజుల కిందట హోటల్‌లో చేరిక
కళాశాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా ఈనెల 18 నుంచి తిరిగి తరగతులు ప్రారంభం అయ్యాయి. వంశీకృష్ణ వట్లూరు కేవీఆర్‌ భవన్‌లో గది అద్దెకు తీసుకుని కళాశాలకు వెళుతున్నాడు. ఈనెల 17న సెలవులు ముగించుకుని ఏలూరు తిరిగివచ్చాడు. అతని గది పక్కనే మరో గదిలో ఉంటున్న జాన్‌హెన్రీ అనే విద్యార్థితో సన్నిహితంగా ఉండేవాడు. 19న రాత్రి ఆకస్మికంగా గదిలో నుంచి బయటకు వచ్చి జాన్‌హెన్రీకి చెందిన ఐఫోన్‌ తీసుకుని, తన ఫోన్‌ను అతడికి ఇచ్చి వెళ్లిపోయాడు. 20న స్థానిక టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని గ్రాండ్‌ ఆర్యా హోటల్‌లో దిగాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి గది తెరవకపోవటంతో హోటల్‌ సిబ్బంది తమ రికార్డులో పేర్కొన్న హెన్రీ ఫోన్‌కు సాయంత్రం సమాచారం ఇచ్చారు. అతను హోటల్‌ వద్దకు వచ్చి చూడగా, గది తలుపులు వేసి ఉన్నాయి. హెన్రీ, హోటల్‌ సిబ్బంది త్రీటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఐ హేట్‌ మై లైఫ్‌
‘నాన్నా.. నా చావుకు ఎవరూ కారణం కాదు. ఐ హేట్‌ మై లైఫ్‌.. ఐ హేట్‌ మనీ.. జీవితం మీద విరక్తి కలిగి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నేను కొందరి వద్ద నుంచి డబ్బులు అప్పు తీసుకున్నాను. వాళ్లని ఏమీ తిట్టవద్దు.. వాళ్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేయండి. నాకు బతకాలనే ఆశ లేదు.’ అని వంశీకృష్ణ సూసైడ్‌నోట్‌ రాసి కన్నుమూశాడు.

మరిన్ని వార్తలు