ఎందుకిలా చేశావమ్మా?

10 Sep, 2019 05:34 IST|Sakshi
విలపిస్తున్న విద్యార్థిని తల్లి (ఇన్‌సెట్‌లో) పి.భవ్య (ఫైల్‌)

ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

ప్రైవేట్‌ హాస్టల్‌లో ఘటన 

కురబలకోట (చిత్తూరు జిల్లా): కురబలకోట మండలం అంగళ్లులో ఇంజనీరింగ్‌ విద్యార్థిని పి.భవ్య (19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న ప్రైవేట్‌ హాస్టల్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ముదివేడు ఎస్‌ఐ సుకుమార్‌ కథనం మేరకు.. కడపకు చెందిన పి.భవ్య మదనపల్లె దగ్గర అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. రెండు నెలల క్రితం కళాశాల దగ్గరున్న ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో చేరింది. అక్కడి నుంచి కళాశాలకు వెళ్లేది. సోమవారం కూడా హాస్టల్‌ నుంచి కళాశాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. కొంత సేపటికే తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. పరీక్ష కూడా రాయలేదని చెబుతున్నారు.

హాస్టల్‌ గది నుంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్‌ నిర్వాహకులు చూశారు. పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో చూశారు. సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీఆర్వో అంజికుమార్‌ సమక్షంలో గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఘటన స్థలంలో ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంది. తల్లి కృష్ణవేణి మధ్యాహ్నం అంగళ్లుకు చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి.. ఎందుకిలా చేశావమ్మా..? అంటూ బోరున విలపించారు. ఈమె తండ్రి సంజీవరాయుడు విజయవాడలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె రాసిన సుసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
సారీ మమ్మీ.. సారీ డాడీ..
‘‘నాకు వేరే మార్గం కనిపించలేదు.. నేను తప్పు చేస్తున్నా అని తెలుసు.. బట్‌ నన్ను మీరైనా అర్థం చేసుకోండి.. నేను ఇలా చేసుకున్నందుకు ఎవరూ రీజన్‌ కాదు.. బబ్లూ.. మంచిగా చదువుకొని అమ్మవాళ్లను బాగా చూసుకో.. అమ్మమాట విను. నేను చేసిన దానికి నాకు ఇదే పనిష్‌మెంట్‌..’’ ‘‘నన్ను అందరూ బాగా చూసుకున్నారు.. నామీద పెట్టుకున్న హోప్స్‌ని నిలబెట్టుకోలేక పోతున్నందుకు బాధపడకండి’’ 
(ఇంగ్లిష్‌లో భవ్య రాసిన సుసైడ్‌ నోట్‌ సారాంశం)

మరిన్ని వార్తలు