ప్రాణం తీసిన అతివేగం

21 Sep, 2019 08:39 IST|Sakshi
రణధీర్‌రెడ్డి (ఫైల్‌) ప్రమాదంలో మృతి చెందిన రణధీర్‌రెడ్డి

బస్సు కింద పడి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

కుత్బుల్లాపూర్‌: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నుంచి అద్దెకు తీసుకున్న ద్విచక్ర వాహనంపై త్రిపుల్‌ రైడింగ్‌లో దూసుకు వెళ్తున్న కళాశాల విద్యార్థులు బస్సును ఢీకొనగా ఒకరు మృతి చెందిన సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్‌ చదువుతున్న రణధీర్‌రెడ్డి కొంపల్లిలోని డ్రైవేజ్‌ ఇండియా ట్రావెల్స్‌ నుంచి ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. తన క్లాస్‌మేట్స్‌ హిమాంశు, సాయివర్ధన్‌లతో కలిసి బైక్‌పై శుక్రవారం సాయంతరం 5.30 గంటలకు త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తూ మైసమ్మగూడ నుంచి బహదూర్‌పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మూలమలుపు వద్ద బండి స్కిడ్‌ అవడంతో ముగ్గురు వాహనంపై నుంచి కింద పడ్డారు.

అయితే రణధీర్‌ కుడి వైపున రోడ్డు మధ్యలో పడిపోవడంతో ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్‌ బస్సు రణధీర్‌రెడ్డి తలమీద నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. రణధీర్‌రెడ్డి పెద్దపల్లి జిల్లా నుంచి చదువు కోవడానికి నగరానికి వచ్చాడు. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయం చేస్తుండగా తల్లి మాధవి గృహిణి. కాగా రణధీర్‌రెడ్డి త్రిపుల్‌ రైడింగ్‌ చేయడం, హెల్మెట్‌ ధరించకపోవడం, అతివేగంగా బైకునడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా డ్రైవేజ్‌ ఇండియా ట్రావెల్స్‌ సంస్థ అద్దెకు ఇచ్చిన వాహనంపై మే 30, 2019 న కొత్తగూడలోని బొటానికల్‌ గార్డెన్‌ వద్ద రాంగ్‌ రూట్, నో హెల్మెట్‌ నేరంతో రూ.1235 ఇ–చలాన్‌ జారీ అయింది. 

మరిన్ని వార్తలు