ఈఎస్‌ఐ స్కామ్‌ : తవ్వేకొద్దీ బయటపడుతున్నభారీ అక్రమాలు

22 Feb, 2020 19:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వందల కోట్లు నొక్కేసిన ఈఎస్‌ఐ స్కామ్‌లో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ల్యాబ్ కిట్ల పేరుతో భారీ దోపిడీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. మూడు కంపెనీలతో కుమ్మక్కైన గత మంత్రులు.. 237 కోట్ల ల్యాబ్ కిట్లు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు చేసినట్టు బట్టబయలయింది. ఓమ్నీ మెడి, అవెంతార్, లెజెండ్‌ కంపెనీలకు ల్యాబ్ కిట్ల కాంట్రాక్టులు ఇచ్చి.. 85 కోట్లు దోపిడీ చేసినట్టు విజిలెన్స్ అధికారులు  గుర్తించారు. రూ. 90 విలువైన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌కు రూ.190 చెల్లించారు. 25 రూపాయల థైరాయిడ్‌(1ఎంజీ) కిట్‌కి రూ.93 పెట్టి కొనుగోలు చేశారు. రూ.155 ధరగల షుగర్‌ టెస్ట్‌ కిట్‌కి రూ.330 చెల్లించారు. 

(చదవండి : ఏపీ ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం)

రూ.11 గ్లూకోజ్ ఎనలైజర్ స్ట్రిప్ రూ 62 కి కొనుగోలు చేశారు. సోడియం,పొటాషియం ఎలక్ట్రోల్ ధరలను భారీగా పెంచేసి రూ.44వేలు చొప్పును చెల్లింపులు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ సొమ్మంతా లెజెండ్ ,ఓమ్నీ మెడి, అవెంతార్‌లకే ధారాదత్తం చేసినట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  ఓ నివేదిక విడుదల చేసింది.

(చదవండి : కేసు నమోదవడం ఖాయం: ఎస్పీ వెంకట్‌రెడ్డి)

ఆస్పత్రులకు వెళ్లకుండానే పలు బిల్లులు  చెల్లించారు. సర్టిఫికేట్లు లేకుండానే బిల్లులపై డైరెక్టర్లు సంతకం చేశారు. రూ.85 కోట్లను మూడు కంపెనీలు కొల్లగొట్టాయని విజిలెన్స్‌ అధికారులు తేల్చిచెప్పారు. కరికి హెయిర్‌ ఆయిల్‌ పేరుతోనూ కోట్లు మింగేశారు. అవసరంలేని గ్లేన్‌మార్క్‌ ఆయిల్‌ను అధికారులు కొనుగోళ్లు చేశారు. మూడు నెలల్లో ఎక్స్‌పైర్‌ అయ్యే వాటిని తెచ్చి స్టోర్స్‌లో ఉంచారు. ఎక్స్‌పైర్‌ అయిపోయే ఆయిల్స్‌ పేరుతో రూ.40  కోట్లకు పైగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.  

టీడీపీ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం : శంకర్‌ నారాయణ
చంద్రబాబు నాయుడు హయాంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని మంత్రి శంకర్‌ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ..  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఈ విషయం బయటపడడంతో చంద్రబాబు అండ్‌ కో ఉలిక్కిపడుతోందని విమర్శించారు. టీడీపీ నేతల అవినీతి బయటపడడంతో ప్రభుత్వం బీసీలపై కక్షకట్టిందంటూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలను అన్ని విధాల ఆదుకుంటున్న ఏకైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. చంద్రబాబు అవినీతిపై సిట్‌ వేయడంతో ఆయన గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. సిట్‌ విచారణలో టీడీపీ నేతల అవినీతి రుజువై  జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి శంకర్‌ నారాయణ అన్నారు.

మరిన్ని వార్తలు