‘పాతికేళ్ల’ పోకిరీలు!

6 Aug, 2018 12:39 IST|Sakshi

షీ–టీమ్స్‌కు చిక్కిన వారిలో 25 ఏళ్లు నిండినవారే అత్యధికం

నాలుగేళ్లలో అందినమొత్తం 4118 ఫిర్యాదులు

టీజింగ్‌కు సంబంధించిన కేసులే ఎక్కువ...

సాక్షి, సిటీబ్యూరో: కనిపిస్తే చాలు కామెంట్స్‌ చేసే వారు కొందరు... నెంబర్‌ దొరికితే చాలు అభ్యంతరకర సందేశాలు పంపేవారు ఇంకొందరు...అదును చూసుకుని తాకాలని ప్రయత్నించే వారు మరికొందరు.. ఇలా నగర షీ–టీమ్స్‌కు నిత్యం అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. నాలుగేళ్ల కాలంలో మొత్తం 4118 ఫిర్యాదులు రాగా... బాధ్యులైన వారిలో అత్యధికులు పాతికేళ్లు నిండిన వాళ్లే ఉన్నారు. మరోపక్క కౌన్సెలింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్న నగర పోలీసు షీ–టీమ్స్‌... అనంతరం వారిపై నిఘా కొనసాగిస్తున్నాయి. 

నగరంతోనే మొదలైన టీమ్స్‌...
ఈవ్‌టీజింగ్‌ నుంచి ఫోన్‌ వేధింపుల వరకు వివిధ రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే యువతులు/మహిళలు గతంలో సాధారణ పోలీసుల్నే ఆశ్రయించి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. దీంతో అనేక మంది అసలు ఫిర్యాదులకే దూరంగా ఉండి వేధింపుల్ని మౌనంగా భరించేవారు. పోకిరీలు దీన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోయే వారు. ఒకప్పుడు సిటీలో కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే యువతులు హడలిపోవాల్సిన పరిస్థితి. వీటిని గమనించిన ప్రభుత్వం 2014లో షీ–టీమ్స్‌కు రూపమిచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా నగరంలో ప్రారంభించిన ఈ విధానాన్ని ఆపై సైబరాబాద్, రాచకొండలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో షీ–టీమ్స్‌ ఏర్పాటు చేసి మహిళలు/యువతులకు రక్షణ కల్పిస్తున్నారు. 

పక్కా ఆధారాలతోనే పడతారు...
భరోసా కేంద్రం ఆధీనంలో పనిచేసే ఈ షీ–బృందాలు ప్రధానంగా రెండు రకాలుగా విధులు నిర్వర్తిస్తాయి. ఎవరైనా ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటూ నేరుగా, ఫోన్‌ ద్వారా, సోషల్‌మీడియా ద్వారా ఫిర్యాదు చేసినప్పుడు తక్షణం స్పందించి బాధ్యతలను గుర్తించడంతో పాటు వారిపై చర్యలు తీసుకుంటాయి. ఈ పనితో పాటు నగరంలోని పబ్లిక్‌ ప్రదేశాలు, కాలేజీలు, పాఠశాలలు ఉన్న ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, పార్క్‌ల్లోనూ షీ–టీమ్స్‌ నిఘా వేసి ఉంచుతాయి. అక్కడ తిష్టవేసే పోకిరీలను పట్టుకుంటాయి. ఏ సందర్భంలో అయినా పక్కా ఆధారాలతోనే బాధ్యతలను అదుపులోకి తీసుకుంటారు. దీనికోసం డెకాయ్‌ ఆపరేషన్లు చేయడం, పోకిరీల వ్యవహారశైలిని రికార్డు చేయడంతో పాటు అవసరమైతే సాంకేతిక ఆధారాలను సైతం సేకరిస్తుంటారు. అయితే  అత్యధికంగా ‘డయల్‌–100’ ద్వారా 1525 ఫిర్యాదులు వచ్చాయి. 

కేసుల నుంచి కౌన్సిలింగ్‌ వరకు...
షీ–టీమ్స్‌ తమకు వచ్చిన ఫిర్యాదుల్లో బాధ్యులు, డెకాయ్‌ ఆపరేషన్స్‌లో దొరికిన వారు, నిఘాలో చిక్కిన వారిలో అందరిపై ఒకే విధంగా స్పందించదు. వారి వ్యవహారశైలి, నేర స్వభావం, కుటుంబ నేపథ్యం, లిఖిత పూర్వక ఫిర్యాదు విషయంలో బాధితులు చూపే ఆసక్తి తదితరాలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటారు. భరోసా, షీ–టీమ్స్‌లు పోలీసుస్టేషన్లు కాకపోవడంతో కేసులు నమోదు చేసే అధికారం లేదు. ఈ నేపథ్యంలోనే తీవ్రమైన నేరం చేసిన వారిపై సైబర్‌ క్రైమ్‌ ఠాణాతో పాటు వివిధ పోలీసుస్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిస్తున్నారు. అత్యధికులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ చేస్తున్నారు. అలాంటి చర్యలు పునరావృతం కానీయవద్దంటూ హెచ్చరించి పంపిస్తున్నారు.  చిక్కిన వారిలో 1872 మందికి కౌన్సిలింగ్‌ చేయడంతో పాటు వారి వ్యవహారశైలిపై కొన్నాళ్లు నిఘా ఉంచుతున్నారు. 

వెంటపడి అభ్యంతరకరంగాప్రవర్తిస్తున్నారు...
వివిధ రకాలుగా, మాధ్యమాల ద్వారా షీ–టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదులు, డెకాయ్‌ ఆపరేషన్స్‌లో చిక్కుతున్న వారిలో యువతులు/మహిళల వెంటపడటంతో పాటు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. నాలుగేళ్లలో ఈ తరహాకు చెందినవి 606 నమోదయ్యాయి. సోషల్‌మీడియా ద్వారా వేధింపులు 122, ఫోన్‌ హెరాస్‌మెంట్‌ కేసులు 35, యువతులు/మహిళల్ని తాకిన ఉదంతాలకు సంబంధించి 82 నమోదయ్యాయి. వీటిలో కొన్నింటిలో ఎఫ్‌ఐఆర్‌లు కాగా మరికొన్నింటిలో కౌన్సిలింగ్, వార్నింగ్, పెట్టీ కేసులు నమోదయ్యాయి. బాధ్యుల్ని గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న షీ–టీమ్స్‌ సాకేంతిక పరిజ్ఞానాన్నీ వినియోగిస్తున్నాయి. అవసరమైతే సైబర్‌ క్రైమ్‌తో పాటు స్థానిక పోలీసుల సహకారం తీసుకుని చర్యలు తీసుకుంటున్నాయి. హాక్‌–ఐ, ట్విటర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులకూ స్పందించి రంగంలోకి దిగుతున్నాయి. 

పాతికేళ్లు దాటినా అదే పంథా...
పోకిరీల పేరు చెప్పగానే సాధారణంగా టీనేజర్లు, మైనర్లే గుర్తుకువస్తారు. అయితే సిటీలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే 25 ఏళ్లు దాటిన...35 ఏళ్ళ లోపు వాళ్లే ఎక్కువగా నిందితులుగా షీ–టీమ్స్‌కు చిక్కారు. మొత్తం 1122 మందిని అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం జరిగింది. వీరిలో 25–35 ఏళ్ళ మధ్య వయస్కులు అత్యధికంగా 384 మంది ఉన్నారు. 18 ఏళ్ల లోపు మైనర్లు 101 మంది, 19–24 ఏళ్ళ మధ్య వయస్కులు 362 మంది, 36–50 ఏళ్ళ మధ్య వయస్కులు 258 మంది, యాభై ఏళ్ళు దాటిన వారు 50 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్న షీ–టీమ్స్‌తో మహిళలు, యువతులకు భరోసా లభించిందని, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా తక్షణం స్పందిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు