తల్లీకూతుళ్లను అడ్డగించిన యువకులు

28 Jan, 2020 07:31 IST|Sakshi

నిందితుల కోసం పోలీసుల గాలింపు

బంజారాహిల్స్‌: నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న తల్లీకూతుళ్లను ఇద్దరు యువకులు అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం:13లోని గౌరీశంకర్‌ కాలనీలో నివసిస్తున్న లక్ష్మి అనే వివాహిత తన ఏడేళ్ల కూతురితో కలిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో  వైట్‌హౌస్‌ మీదుగా గౌరీశంకర్‌ నగర్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

వైట్‌హౌస్‌ వెనకాల రోడ్డు వద్దకు రాగానే ఇద్దరు ఆగంతుకులు స్కూటీ మీద వచ్చి అడ్డగించారు. వీరిలో ఓ యువకుడు ఆమె కూతురును బలవంతంగా స్కూటీపై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మరో యువకుడు లక్ష్మి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుండగానే ఆగంతుకుడు ఆమెను కిందకు నెట్టేసి పరారయ్యాడు. ఆందోళన చెందిన ఆమె కూతురు కోసం గాలిస్తూ ఇంటికి వెళ్లగాఇంట్లోనే కూతురు కనిపించింది. తన కూతుర్ని బలవంతంగా లాక్కెళ్లి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 354, 323, 341 కింద క్రిమినల్‌ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు