గుజరాత్‌ బీజేపీ మాజీ ఎంపీకి షాక్‌

11 Jul, 2019 16:49 IST|Sakshi

అహ్మదాబాద్‌ : ఆర్టీఐ కార్యకర్త  సంచలన హత్య కేసులో బీజేపీ మాజీ ఎంపీ, మైనింగ్‌ మాఫియా దిను బోఘా సోలంకికి  అహ్మదాబాద్‌ సీబీఐ  కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. సోలంకితో  పాటు ఈ కేసులో దోషులందరికీ జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. గత శనివారం  సోలంకి తోపాటు మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు గురువారం వీరికి  శిక్షలను ఖరారు  చేస్తూ తీర్పును వెలువరించింది. అలాగే వీరికి 59,25,000 రూపాయలు  జరిమానా కూడా విధించింది. ఈ సొమ్ములో  రూ.11 లక్షలు  ఆర్టీఐ కార్యకర్త కుటుంబానికి అందజేయాలని  ఆదేశించింది. ముఖ‍్యంగా భార్యకు రూ. 5 లక్షలు, ఇద్దరు పిల్లలకు రూ.3 లక్షల  చొప్పున ఏదైనా జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్‌  డిపాజిట్‌ చేయాలని  చెప్పింది. 

అక్రమ మైనింగ్‌ కార్యకలాపాలపై  ఆర్టీఐలో పిల్‌ దాఖలు చేసిన  నెలరోజుల్లోనే  ఆర్టీఐ కార్యకర్త అమిత్‌ జేత్వా హత్య గురయ్యారు. జూలై 20, 2010న గుజరాత్ హైకోర్టు ఆవరణలో  సోలంకి, మరికొంతమందితో కలిసి అమిత్‌ను దారుణంగా హత్య గావించారన్న సీబీఐ వాదనలను కోర్టు విశ్వసించింది. దీంతో దిను సోలంకి మేనల్లుడు శివ సోలంకి, శైలేష్ పాండ్యా(షూటర్) తోపాటు బహదూర్‌సింగ్ వాధర్, పంచన్ జి దేశాయ్, సంజయ్ చౌహాన్, ఉదాజీ ఠాకకూర్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక న్యాయమూర్తి కెఎం డేవ్‌ జీవిత ఖైదు శిక్షను విధించారు.

మరోవైపు తన కుమారుడు అమిత్‌ జేత్వా హత్య పై సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న తండ్రి  భిఖిభాయ్‌ జేత్వా ఈ తీర్పు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాజా తీర్పు భారత న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి లభించిన విజయమని పేర‍్కొన్నారు.  ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందన్నారు.

చదవండి : సంచలన హత్యకేసులో బీజేపీకి షాక్‌

మరిన్ని వార్తలు