విష్ణు కోసం ముమ్మర గాలింపు

1 Oct, 2017 19:51 IST|Sakshi
సీసీటీవీ దృశ్యాలు.. ఇన్‌సెట్‌లో విష్ణు..

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో విస్తృతంగా గాలింపుముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలువిష్ణు బావ రాజేస్‌నాయుడి అరెస్ట్‌

సాక్షి, జయనగర: పోలీసుల కళ్లుగప్పి పరారైన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడి మనవడు విష్ణు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విష్ణు తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అతని ఆచూకీ కోసం మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్నారు. అక్క చేతన, గన్‌మెన్‌తో కలిసి విష్ణు కారులో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాళహస్తికి చెందిన విష్ణు బావ రాజేశ్‌నాయుడు కూడా వాహనంలో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా కనిపెట్టారు. దీంతో రాజేష్‌నాయుడును అరెస్ట్‌చేసి విష్ణు ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

మితిమీరిన వేగంతో కారును నడుపుతూ..  మరో కారును ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడేందుకు విష్ణు కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన విష్ణు బెంగళూరులోని మాల్యా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ కేసులో మాల్యా ఆస్పత్రి  వ్యవస్థాపక డైరెక్టర్‌ అయిన విష్ణు తల్లి డాక్టర్‌ తేజశ్వరి, తండ్రి శ్రీనివాసమూర్తిని పోలీసులు విచారించారు. విష్ణు తన అక్క చేతనతో కలిసి శనివారం హైదరాబాద్‌లో ఉన్నట్లు పక్కాసమాచారం అందిందని, అక్కడికి పోలీసులు వెళ్లేలోపు ఇద్దరూ పారిపోయారని,  సాధ్యమైనంత త్వరగా విష్ణును అరెస్ట్‌ చేస్తామని దక్షిణ వలయ డీసీపీ శరణప్ప తెలిపారు. విష్ణు కుటుంబసభ్యులు, అతని స్నేహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో గాలింపు చేపట్టినట్లు ఆయన తెలిపారు. విష్ణు కారులో గంజాయి లభించిన నేపథ్యంలో ఎన్‌డీపీఎస్‌ కేసుతోపాటు  పోలీసుల అదుపులోనుంచి తప్పించుకున్న ఘటనకు సంబంధించి ఐపీఎస్‌ సెక‌్షన్‌  224, 225 కింద కేసు నమోదుచే శామని శరణప్ప తెలిపారు. విష్ణు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందిందని, రేపటిలోగా విష్ణు జాడను కనిపెట్టి అరెస్ట్‌ చేస్తామన్నారు.

పథకం ప్రకారమే పరారీ
విష్ణు పథకం ప్రకార పరారీ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. విష్ణు కారులో లభించిన గంజాయి విషయంపై విచారణ చేపట్టేందుకు పోలీసులు గత నెల 28న మధ్యాహ్నం మాల్యా ఆస్పత్రికి వెళ్లారు. అయితే విష్ణుకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చామని, పది గంటల విశ్రాంతి అవసరమని విష్ణు తల్లి తేజేశ్వరి, ఇతర వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు అదే రోజు అర్ధరాత్రి 12.30గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లగా విష్ణుకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో ఒక హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ను బందోబస్తుగా ఉంచారు. అయితే 29వ తేదీ ఉదయం 6.15గంటల సమయంలో విష్ణు అత్యవసర ద్వారం నుంచి ఉడాయించాడు.

మరిన్ని వార్తలు