ఎక్సైజ్‌ దూకుడు

12 Mar, 2020 13:30 IST|Sakshi
గిద్దలూరు ప్రాంతంలో నాటుసారా బట్టీ ధ్వంసం చేస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 19 బృందాలతో దాడులు

మద్యంతోపాటు రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ఒంగోలు: ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు బుధవారం జిల్లాలో దూకుడు పెంచారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మద్యం, ధన ప్రభావం ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ప్రశాంత ఎన్నికల నిర్వహణపై ఎక్సైజ్‌ శాఖ దృష్టి సారించింది. తాజాగా శాండ్‌ ఎన్‌పోర్సుమెంట్, ఎక్సైజ్‌ శాఖ ఐజీగా బాధ్యతలు చేపట్టిన వినీత్‌ బ్రిజ్‌లాల్‌ రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా, అక్రమ మద్యం తయారీ, అక్రమంగా మద్యం కలిగి ఉండటం.. తరలించడం వంటి వాటిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో బుధవారం విజయవాడ నుంచి ఒక స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు టీంతోపాటు జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఈయస్‌ పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్సు టీంలు, జిల్లాలోని 14 పోలీసుస్టేషన్ల పరిధిలోని 14 బృందాలు వెరసి మొత్తం 19 బృందాలుగా ఏర్పడ్డాయి. సభ్యుల ఆధ్వర్యంలో కలిసి నాటు సారా తయారీ కేంద్రాలుగా ఉన్న పశ్చిమ ప్రకాశంతో పాటు చీరాల ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఒంగోలు, చీరాల, అద్దంకి, చీమకుర్తి, మార్కాపురం, కందుకూరు, సింగరాయకొండ, కంభం, వై.పాలెం, గిద్దలూరు ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్ల పరిధిలోని 19 గ్రామాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 46 కేసులు నమోదుచేసి 10 మందిని అరెస్టు చేశారు. 90 లీటర్ల నాటుసారాను సీజ్‌ చేయడంతోపాటు 6900 లీటర్ల సారా తయారీకి వినియోగించే బెల్లం ఊట ధ్వంసం చేశారు. అదే విధంగా 150 కేజీల నల్లబెల్లం, 52 కేజీల ఆలం, 16 కేజీల నవసరం, 20 కేజీల కరక్కాయ సీజ్‌చేశారు. సింగరాయకొండ పరిధిలో ఒక వ్యక్తి కారులో 36 బాటిళ్ల మద్యం తీసుకువెళ్ళడంతో అతనిని అరెస్టు చేసి కారును సీజ్‌ చేశామని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వై.శ్రీనివాసచౌదరి తెలిపారు. 

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌: ఒంగోలు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు ఒంగోలు ఎక్సైజ్‌ పోలీసులు స్థానిక మంగమ్మ కాలేజీ జంక్షన్‌ వద్ద రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మద్దిపాడు మండలం లింగంగుంటకు చెందిన జాన్‌ అనే వ్యక్తిని, పేర్నమిట్టకు చెందిన మోషే అనేవారిని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గుర్తించి తాలూకా పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమంగా తరలించినా పట్టుకోవడం జరుగుతుందని, కేసుల నమోదుకు కూడా మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయని ఒంగోలు ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ ఎస్సై సయ్యద్‌ మునీర్‌ అహ్మద్, హెడ్‌కానిస్టేబుల్‌ సి.హెచ్‌.హనుమరాజు, ఎస్‌.ఈశ్వరరెడ్డి, ఎస్‌.రామచంద్ర, డి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా