నకిలీ మద్యం ‘ముఠా’ గుట్టురట్టు!

14 Mar, 2018 11:55 IST|Sakshi
ప్రహికాత్మక చిత్రం

బేతపల్లెలో భారీ మొత్తంలో ‘స్పూరియస్‌ లిక్కర్‌’ స్వాధీనం  

ఎక్సైజ్‌ అధికారుల అదుపులో సరఫరాదారుడు, ఇద్దరు ఏజెంట్లు

కర్నూలు : నకిలీ మద్యం ముఠా గుట్టును ఎక్సైజ్‌ అధికారులు రట్టు చేశారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఏఈఎస్‌ ఆర్‌.వి.సుధాకర్, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిఘా వేసి ఏపీ21 ఏఈ 8159 నంబరు గల టాటా సుమోలో తరలిస్తున్న 1400 మెక్‌డోవెల్స్‌ క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రవాణాదారుడితో పాటు ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

తిమ్మాపురం కేంద్రంగా వ్యాపారం...  
ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం కేంద్రంగా నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన రంగస్వామి రెండేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్‌ అధికారుల విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. కృష్ణగిరి, గోనెగండ్ల, దేవనకొండ, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం మండలాల్లో బెల్టు దుకాణాలే లక్ష్యంగా ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. 

ఎల్లాగౌడ్‌పై గతంలో పీడీ యాక్ట్‌...  
నకిలీ మద్యం వ్యాపారి ఎల్లా గౌడ్‌ గతంలో కూడా ఎక్సైజ్‌ అధికారులకు పట్టుబడి దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈయనపై పీడీ యాక్ట్‌ నమోదు కావడంతో కొంతకాలం పాటు వ్యాపారానికి విరామం ప్రకటించి అధికార పార్టీకి చెందిన నాయకుల అండతో రెండేళ్లుగా మళ్లీ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం.  

నకిలీ మద్యం తయారీ ఇలా...  
రాయచూరు జిల్లా గిలకసుగూరు గ్రామానికి చెందిన ఎల్లాగౌడ్‌ అదే గ్రామంలో ఓ రహస్య ప్రదేశంలో మెక్‌డోవెల్స్‌ కంపెనీకి చెందిన పాత సీసాలను పెద్దఎత్తున పోగుచేసి కలర్‌ నీళ్లలో స్పిరిట్‌ కలిపి సీసాలకు నింపి ప్రత్యేక మిషన్‌తో ప్లాస్టిక్‌ మూతలు బిగించి  జిల్లాలోని బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. మండలాల వారీగా ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నట్లు  తెలుస్తోంది. బంటుపల్లె గ్రామానికి చెందిన బాలా గౌడ్, వీరాంజనేయులు దేవనకొండ మండలంలో బెల్టు షాపులకు స్పూరియస్‌ లిక్కర్‌ (విషపూరితమైన మద్యం) సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్‌ అధికారులు నిఘా వేసి పట్టుకున్నట్లు సమాచారం.  

రెండు నెలలుగా నిఘా...  
ఎక్సైజ్‌ అధికారులు తిమ్మాపురం రంగస్వామిపై రెండు నెలలుగా నిఘా ఉంచి  ఈదులదేవరబండ నుంచి వెంబడించి బేతపల్లె గ్రామ సరిహద్దులో పట్టుకున్నట్లు తెలుస్తోంది. గిలకసుగూరు నుంచి మాధవరం చెక్‌పోస్టు మీదుగా జిల్లాలోకి నకిలీ మద్యం రవాణా అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఐదుగురు కానిస్టేబుళ్లను గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు, దేవనకొండ మండలం ఈదులదేవరబండ దగ్గర కాపలా ఉంచి పక్కా సమాచారంతో నకిలీ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్కార్ట్‌గా మరో వాహనంలో వెళ్తున్న ఏజెంట్లు బాలాగౌడ్, వీరాంజనేయులును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పత్తికొండ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారుల అదుపులో ఉన్న ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

చెక్‌పోస్టులకు ముందే సమాచారం...  
జిల్లా సరిహద్దు గ్రామాలకు గిలకసుగూరు ఆనుకుని ఉండటంతో కర్ణాటక పోలీసుల నిఘా  కొరవడింది. దీంతో నకిలీ మద్యం రవాణాదారులు చెక్‌పోస్టులలో మామూళ్లు ముట్టజెప్పి వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని దాదాపు పది మండలాలను కేంద్రంగా చేసుకుని నెలకు రెండుసార్లు గిలకసుగూరు నుంచి బెల్టు దుకాణాలకు ఎల్లా గౌడ్‌ ఏజెంట్ల ద్వారా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. నకిలీ మద్యం తరలించే వాహనాల నంబర్లు చెక్‌పోస్టులో ఉన్న అధికారులకు ముందుగానే చేరవేస్తారు. దీంతో తనిఖీలు లేకుండానే అక్కడి అధికారులు వదిలేస్తుండటంతో నకిలీ మద్యం వాహనాలు జిల్లాలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు