సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

16 Jul, 2019 10:25 IST|Sakshi
నాటుసారా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, మార్కాపురం(ఫ్రకాశం) : మార్కాపురం ఎక్సైజ్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తమ సిబ్బంది దాడులు నిర్వహించి నాటుసారా బట్టీలు, బెల్లం ఊటను ధ్వంసం చేసి పలువురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎ.ఆవులయ్య తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘పశ్చిమాన సారా’ శీర్షికతో సోమవారం ఓ కథనం ప్రచురితమైంది. ఎక్సైజ్‌ అధికారులు స్పందించి వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఆవులయ్య తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

మార్కాపురం ఎక్సైజ్‌ సీఐ రాధాకృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పెద్దదోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లె గ్రామంలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అరెస్టు  చేసినట్లు తెలిపారు. ఇదే మండలంలోని దోర్నాల శివార్లలో 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గిద్దలూరు సీఐ సోమయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం అర్ధవీడు మండలం యాచవరం చెంచుకాలనీలో దాడులు నిర్వహించి 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు సూపరింటెండెంట్‌ ఆవులయ్య తెలిపారు.

ఇదే మండలం వెంకటాపురంలో కూడా 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. యర్రగొండపాలెం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని బిళ్లగొంది చెంచుగూడెంలో 100లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు చెప్పారు. కనిగిరి సీఐ ఆధ్వర్యంలో హజీజ్‌పురంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న మహిళను అరెస్టు చేసి 10 క్వార్టర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆవులయ్య వివరించారు.

మార్కాపురం ఎక్సైజ్‌ పరిధిలో తొమ్మిది పోలీసుస్టేషన్లు ఉన్నాయని, బెల్ట్‌షాపులు నిర్వహించినా, ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మినా, నాటుసారా తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల సమాచారాన్ని తమకు తెలియజేయాలని, వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మార్కాపురం ప్రాంత దాడుల్లో ఎక్సైజ్‌ సిబ్బంది జి.వెంకటేశ్వర్లు, నగేష్, రమేష్, కాశయ్య, పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు