ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు అరెస్ట్‌

30 May, 2018 10:31 IST|Sakshi
అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకట్రావ్‌

పర్యవేక్షణ లేకపోవడం  వల్లే ప్రమాదం

తాత్కాలికంగా ఎగ్జిబిషన్‌ నిలుపుదల

అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్‌ వెల్లడి

అనంతపురం సెంట్రల్‌: జెయింట్‌వీల్‌ ప్రమాదంలో చిన్నారి మృతికి కారకులైన ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు రఘు, ఆపరేటర్‌ మహాదేవ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలను మంగళవారం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకట్రావ్‌ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 27న నగరంలోని రోబో అనిమల్స్‌ ఎగ్జిబిషన్‌లో జెయింట్‌వీల్‌లోంచి బాక్సులు విరిగి పడిన ఘటనలో ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన అమృత మృతి చెందిన విషయం విదితమే. ఇదే ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన త్రీటౌన్‌ పోలీసులు ఎగ్జిబిషన్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్దారించారు. ‘తప్పెవరిది.. శిక్ష ఎవరికి?’ అన్న శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు.

నగరంలో శ్రీనివాసనగర్‌కు చెందిన ఎగ్జిబిషన్‌ నిర్వాహకుడు రఘు, ముంబైకి చెందిన జెయింట్‌ వీల్‌ ఆపరేటర్‌ మహదేవ్‌లను అరెస్ట్‌ చేశారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వలనే  ప్రమాదం జరిగిందని డీఎస్పీ వివరించారు. ప్రమాదానికి కారణం కావడంతో ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు చెప్పారు. జెయింట్‌ వీల్‌ ఫిట్‌నెస్‌పై నివేదిక ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు లేఖ రాసినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో త్రీటౌన్‌ సీఐ మురళీ కృష్ణ, ఎస్‌ఐలు శంకర్‌రెడ్డి, క్రాంతికుమార్, నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు