బయట పడిన తిను'బండారం'

9 Aug, 2018 08:43 IST|Sakshi
తణుకులో అధికారులు స్వాధీనం చేసుకున్న తినుబండారాల ప్యాకెట్లు

గడువు దాటిన స్నాక్స్‌ ప్యాకెట్లు స్వాధీనం  

తణుకులో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల దాడులు

తణుకు టౌన్‌: పట్టణంలో కాలాతీతమైన తినుబండారాలు అమ్ముతున్న షాపుపై రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు దాడి చేసి  నిల్వ పదార్థాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సత్యవతి ఆస్పత్రి ఎదురుగా కిరాణా, కిళ్లీ షాపులను నిర్వహిస్తున్న పెరుమాళ్ల సాయి గుప్తా గడువు పూర్తయిన కుర్‌కురే, మ్యాగి, మూంగ్దాల్‌ వంటి చిరు తినుబండారాల ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో షాపును తనిఖీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ డెప్యూటీ తహసీల్దార్‌ డి.అశోక్‌ వర్మ తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు షాపులో నిల్వ ఉన్న ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇదే షాపులో వంట గ్యాస్‌ సిలిండర్‌ ఉపయోగించడంతో సిలిండర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు డీటీ వర్మ తెలిపారు.

బయట పడిందిలా...
మంగళవారం రాత్రి తణుకులోని సత్యవతి ఆస్పత్రిలో ఒక మహిళకు రక్తం అవసరం కావడంతో రక్తదానం చేయడానికి  భీమవరంలో బీఎల్‌ చదువుతున్న, పెనుగొండకు చెందిన కర్తాకులు కుమార్‌ ఆస్పత్రికి వచ్చాడు. అతను రక్తం ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని, తర్వాత పిలుస్తాం అప్పుడు రండని చెప్పడంతో కుమార్‌ ఎదురుగా ఉన్న షాపులో రూ.5 విలువ చేసే మూంగ్దాల్‌ ప్యాకెట్లు మూడు కొని ఒక ప్యాకెట్‌ను అక్కడే ఓపెన్‌ చేశాడు.

ప్యాకెట్‌ ఓపెన్‌ చేయగానే ప్యాకెట్‌ నుంచి దుర్వాసన రావడంతో మిగిలిన రెండుప్యాకెట్లు  తీసుకుని వేరే ప్యాకెట్లు ఇవ్వాలని కుమార్‌ షాపు యజమానిని అడిగాడు. దీనికి అతను సరిగా సమాధానం చెప్పకపోగా.. దబాయించాడు. గత్యంతరం లేక మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కుమార్‌ ఫిర్యాదు చేశాడు. వారు షాపులో తనిఖీలు నిర్వహించి నిల్వ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాగే అన్ని షాపులపై దాడులు చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

అడిగితే ఘర్షణకు దిగారు
మంగళవారం రాత్రి సత్యవతి ఆస్పత్రి వద్ద మూంగ్దాల్‌ ప్యాకెట్లు 3 కొని అక్కడే ఒక్కటి ఓపెన్‌ చేశా. ఓపెన్‌ చేయగానే దుర్వాసన రావడంతో వద్దని వేరే ప్యాకెట్లు ఇవ్వాలని షాపు యజమానిని అడిగా. అతను తన స్నేహితులతో కలిసి నాపై ఘర్షణకు దిగడంతో గత్యంతరం లేక రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశా.– కర్తాకుల కుమార్, బాధితుడు, పెనుగొండ

మరిన్ని వార్తలు