అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు

30 Mar, 2019 07:18 IST|Sakshi
పెళ్లి పత్రిక, ఫొటోలు చూపుతున్న బాధితురాలు భార్గవి

పంజగుట్ట: అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి తన హోదాను అడ్డంపెట్టుకుని తనను పుట్టింటికి పంపి, కుమారుడికి మరో వివాహం చేసేందుకు యత్నిస్తున్నాడని భార్గవి అనే మహిళ  ఆరోపించింది. శుక్రవారం ఆమె తన తండ్రి కోటేశ్వరరావుతో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వివరాలు వెల్లడించింది. ఎల్‌బీ నగర్‌కు చెందిన ఎమ్‌.కోటేశ్వర రావు, నాగమణి దంపతుల కుమార్తె భార్గవికి, అంబర్‌పేటకు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎలిగి శంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్‌కు 2017 జులై 28న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.16 లక్షల నగదు, 30 తులాల బంగారం, 2 కిలోల వెండి, ఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అదనపు కట్నం తేవాలని లేని పక్షంలో కొడుకుతో కాపురం చేయించమని, అత్త, మామలు లక్ష్మి, శంకర్‌ వేధించినట్లు తెలిపింది. తన భర్తతో మాట్లాడాలన్నా మామ అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

దీనిపై నిలదీస్తే   భయబ్రాంతులకు గురి చేసేవారని ఆరోపించింది. అత్త, మామలు, ఆడపడుచులు, మరిది ప్రతి రోజు శారీరకంగా, మనసికంగా తనను హింసించే వారని, మరిది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. కుటుంబసభ్యులు బయటికి వెళితే తనను ఇంట్లో బంధించి బయటినుండి తాళం వేసుకుని వెళ్లేవారని తెలిపింది. 2018 నవంబర్‌ 1న హెల్త్‌కార్డు పేరుతో రూ.100 ఖాళీ బాండ్‌ పేపర్పై బలవంతంగా సంతకం చేయించుకున్నారని, దీనిపై భర్తను నిలదీస్తే నిన్ను వదిలించుకోవడానికి పరస్పర విడాకుల కోసం దరఖాస్తు చేసేందుకు సంతకాలు తీసుకున్నట్లు చెప్పాడని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నట్లు పేర్కొంది. వారి వేధింపులు తాళలేక తల్లిందండ్రులకు చెప్పడంతో  వారు మాట్లాడేందుకు ప్రయత్నించగా తన మామ శంకర్‌ హోదాను అడ్డం పెట్టుకుని తన చేతిలో కోర్టులు, పోలీస్‌శాఖ ఉన్నాయని, కుల సంఘాల మద్దతు ఉందని నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని బెదిరించినట్లు తెలిపింది. పెద్దల సలహా మేరకు  తాను పుట్టింటికి వెళ్లగా తన భర్త శ్రీకాంత్‌కు మరో వివాహం చేసేందుకు వివాహ వేదిక వెబ్‌సైట్‌లో బయోడేటా పెట్టినట్లు తెలిపింది. దీనిపై తాను సరూర్‌నగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని తెలిపింది. అయితే శంకర్‌ కేసు దర్యాప్తు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తన మామ నుంచి తనకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని కోరింది. ఇప్పటికైనా తన భర్తను తన వద్దకు పంపాలని వేడుకుంది. 

మరిన్ని వార్తలు