గృహిణి ప్రాణం తీసిన అత్తింటి వేధింపులు

27 Feb, 2020 08:00 IST|Sakshi
సౌమ్య (ఫైల్‌)

ఆత్మహత్యకు పాల్పడిన మహిళ

హస్తినాపురం: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామల వేధంపులు తట్టుకోలేక గృహిణి ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. భువనగిరి యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల మమత, మిర్యాల శ్రీనివాస్‌ దంపతుల కూతురు జ్ఞానేశ్వరి అలియాస్‌ సామల సౌమ్య (23)కు  వనస్థలిపురం హరిహరపురం కాలనీకి చెందిన సామల వెంకయ్య కుమారుడు రాఘవేందర్‌తో 2018లో వివాహమైంది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాఘవేందర్‌కు వివాహ సమయంలో 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు పెళ్లి చేసి సామగ్రి అందజేశారు. వివాహమైన అనంతరం కొన్ని నెలలు బాగానే వారి సంసార జీవితం సాగింది. ఆ తర్వాత దంపతుల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తామామలు వేధిస్తున్నారు.

ఈ క్రమంలో మూడు నెలల క్రితం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. వారు రాజీ కుదిర్చి ఆమెను అత్తారింటికి పంపించారు. పదిరోజులుగా మళ్లీ గొడవలు జరుగుతున్నాయి. సౌమ్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త, అత్తామామలు ఒత్తిడి తెచ్చి ఆమెను ఉద్యోగం మాన్పించారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ సౌమ్య తన తల్లి మమతకు చెప్పింది. బుధవారం స్నానానికి బాత్రూంలోకి వెళ్లిన సౌమ్య ఎంతకు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త రాఘవేందర్‌ తలుపులు పగులగొట్టి చూడగా.. షవర్‌కు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో మనస్తాపం చెందిన రాఘవేందర్‌ బెడ్రూంలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలనీవాసులు గది తలుపులు పగులగొట్టి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.

ప్రవళిక (ఫైల్‌)
వరకట్న వేధింపులకు వివాహిత బలి
మల్లాపూర్‌: వరకట్న వేధింపులు వివాహితను బలి తీసుకున్న ఘటన నాచారం పోలీస్‌సేష్టన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నాచారం సీఐ మహేష్‌ వివరాల ప్రకారం.. మల్లాపూర్‌ బ్రహ్మపురి కాలనీకి చెందిన ప్రవళిక (23) న్యూభవానీనగర్‌కు చెందిన పి.సతీష్‌రెడ్డిలు 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వారి జీవితం సాఫీగా సాగింది. కొద్ది రోజులుగా వరకట్నం తీసుకురావాలంటూ ప్రవళికను భర్త సతీష్‌రెడ్డి, అత్త, ఆడపడుచులు వేధించసాగారు. మంగళవారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండటంలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. దీంతో బుధవారం ప్రవళిక తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు వరకట్నం కోసం అత్తింటివారే హత్య చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు