వివాహేతర సంబంధానికి దారితీసిన టిక్‌టాక్‌

22 Feb, 2020 10:03 IST|Sakshi

సాక్షి, వేలూరు: టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడడంతో.. భార్యకు విడాకులు ఇచ్చేందుకు భర్త నిర్ణయించిన ఘటన సంచలనం కలిగించింది. వేలూరుకు చెందిన 30 ఏళ్ల మహిళకు వివాహం అయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు పిల్లలకు తల్లయిన ఈమె తరచూ టిక్‌ టాక్‌లో కవితలు చెప్పడం, డ్యాన్స్‌ చేయడం, పాటలు పాడడం లాంటివి చేస్తుండేది. ఆ వీడియోలను వాట్సాప్‌ ద్వారా ఇతరులకు పంపేది. ఈమె టిక్‌టాక్‌లను గమనించిన వేలూరులో పనిచేస్తున్న ఇతర రాష్ట్రానికి చెందిన వివాహమైన 32 సంవత్సరాల వ్యక్తి లైక్‌ ఇవ్వడం, కామెంట్‌ పెట్టడం ప్రారంభించాడు. ఐదు నెలల క్రితం వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఫోన్‌లో మాట్లాడడం ప్రారంభించారు.

అప్పటి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారింది. అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ మహిళ తన కుటుంబ సభ్యులను సక్రమంగా పట్టించుకునేది కాదు. భార్యపై అనుమానం వచ్చిన భర్త ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా టిక్‌టాక్‌కు బానిసైనట్టు గమనించారు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని గమనించాడు. వీటిపై పలు మార్లు భార్యను ఖండించినప్పటికీ వినలేదు. వేలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్పందించారు. ఆక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రయివేటు కంపెనీలో పనిచేయడాన్ని నిలుపుదల చేశారు. ఆపై ఆంధ్ర రాష్ట్రానికి పంపి వేశారు. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపి వేశారు. అయినప్పటికీ ఆమె టిక్‌ టాక్‌ మోజులో పడడంతో విడాకులు ఇచ్చేందుకు భర్త అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: వివాహిత ప్రాణం తీసిన టిక్‌టాక్‌ మోజు

‘తిక్క’టాక్‌ యువకుడి అరెస్టు
తిరువొత్తియూరు: పుదుకోటై బస్టాండ్‌లో ప్రజలు భయాందోళనకు గురయ్యోలా ప్రవర్తిస్తూ టిక్‌టాక్‌ చేస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పుదుకోటై కొత్త బస్టాండ్, తిరుచ్చి రైల్వే స్టేషన్, బస్టాండ్‌ తదితర చోట్ల ఓ యువకుడు ప్రజలు భయాందోళనకు గురయ్యేలా విద్యార్థులను ఢీకొట్టడం, వారి ముందు నృత్యం చేయడం, వింతగా ప్రవర్తించడంపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అరుణ్‌ శక్తికుమార్‌ ఆదేశాలకు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో వడగాడు సమీపంలోని కరుక్కానుకురిచ్చి ప్రాంతానికి చెందిన కన్నన్‌ (21)గా తెలిసింది. ఇతను పుదుకోటైలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్నాడు. 
 

మరిన్ని వార్తలు