ప్రియుడే కాలయముడు..ప్రియురాలు హత్య

20 Oct, 2018 14:16 IST|Sakshi
మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని పోలీసులకు చూపుతున్న నిందితుడు రాంబాబు

వెంకటగిరి (నెల్లూరు): వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. ప్రియుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. వెంకటగిరిలోని చింతచెట్టు సెంటర్‌కు చెందిన రజియా అలియాస్‌ పోలమ్మ (22)ను ఆమె ప్రియుడు పట్టణానికి చెందిన పూజారి రాంబాబు హత్యచేసి పూడ్చిపెట్టిన ఘటన గురువారం మండలంలోని యాతలూరు అటవీప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్ట్టణంలోని కైవల్యానది సమీపంలోని వీరమాతల దేవాలయం చింతచెట్టు ప్రాంతానికి చెందిన రజియా శ్రీకాళహస్తి మండలం చింతపూడికి చెందిన వెంకటేశ్వర్లు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు.

జీవనోపాధి నిమిత్తం రజియా భర్త వెంకటేశ్వర్లు సూళ్లూరుపేటలో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఈనెల 11వ తేదీన సబ్బు తీసుకువస్తానని పోలమ్మ పట్టణంలోకి వెళ్లి అప్పటినుంచి కనిపించకుండా పోయింది. రజియా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బంధువుల ఇళ్ల వద్ద వాకబు చేశారు. అయితే ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె తల్లి జవ్వల మస్తానమ్మ తన కుమార్తె కనిపించడంలేదని ఈనెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన పూజారి రాంబాబుపై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాంబాబు పరారీలో ఉండటంతో అతని ఆచూకీ కోసం గాలించారు.

రాయితో కొట్టి..
ఈ నేపథ్యంలో 18వ తేదీ ఉదయం స్థానిక వీఆర్వోతో కలసి రాంబాబు పోలీసులకు లొంగిపోయాడు. అతడిని విచారించగా రజియాను హత్య పూడ్చిపెట్టినట్లు చెప్పాడు. ఆమెతో తనకు పదేళ్ల నుంచి సన్నిహిత సంబంధం ఉందని విచారణలో వెల్లడించాడు. రజియా వివాహం చేసుకున్న తర్వాత తనతో సరిగ్గా ఉండటంలేదని 11వ తేదీన పిలిపించుకుని మండలంలోని యాతలూరు అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న రాయితో రజియా ముఖంపై కొట్టడంతో మృతిచెందినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. మృతదేహాన్ని సమీపంలోని గుంటలో పూడ్చిపెట్టాడు.

నిందితుడు చెప్పిన వివరాల మేరకు సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కొండపనాయుడు, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడి వైద్యుడు శ్రీనివాస్‌ శవపరీక్ష నిర్వహించేందుకు నిరాకరించడంతో ఎస్సై చొరవతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. రాంబాబును పోలీసులు కోర్టుకు హజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు