ఆధ్యాత్మికత ముసుగులో యువతులపై అత్యాచారం

10 Nov, 2018 04:21 IST|Sakshi

తమిళనాడులో వెలుగుచూసిన దొంగస్వామి నాటకాలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: మహిమగల స్వామిగా పరిచయం చేసుకుంటాడు.  మాయమాటలతో మహిళలను, యువతులను లొంగదీసుకుంటాడు. అత్యాచారాలు చేసి ఆస్తులను అపహరిస్తాడు. ఇలా 50 మంది యువతుల జీవితాలతో ఆటలాడి పరారైన చెన్నైకి చెందిన దొంగస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేంద్ర నేర పరిశోధన విభాగం పోలీసులు ఈ దొంగస్వామిని వాంటెడ్‌ క్రిమినల్‌గా ప్రకటించి విమానాశ్రయాలకు లుకవుట్‌ నోటీసులు జారీ చేశారు.

చెన్నై, టీనగర్‌కు చెందిన వెంకటశరవణన్‌ (48) తనకు తానే ఒక ఆధ్యాత్మికవేత్తగా ప్రచారం చేసుకుంటూ తన పేరును ప్రసన్న వెంకటాచార్యర్‌ చతుర్వేదిగా చెప్పుకోసాగాడు. 2002లో చెన్నై ఆళ్వార్‌పేటకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం ఇతని మాయలోపడింది. 2004లో పారిశ్రామికవేత్త పెద్ద కుమార్తె (16)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బైటకు పొక్కడంతో పారిశ్రామికవేత్త భార్య, పెద్దకుమార్తెతో కలిసి పరారయ్యాడు. దీంతో చెన్నై పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సదరు పారిశ్రామికవేత్త చతుర్వేదిపై ఫిర్యాదు చేశాడు.

కేంద్ర నేర పరిశోధక విభాగ పోలీసుల విచారణలో  సుమారు 50 మందికి పైగా యువతులు చతుర్వేది మాయకు లోనైనట్లు ఆధారాలు దొరికాయి. చతుర్వేదిపై కేసులు పెట్టి, అతని సహాయకులు శ్రీధర్, బాలమురుగన్‌లను అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. చతుర్వేదిని పట్టుకునేందుకు పోలీసులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోవడంతో వాంటెడ్‌ నేరస్థుడిగా శుక్రవారం ప్రకటించి విదేశాలకు పారిపోకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుకవుట్‌ నోటీసులు పంపించారు.

మరిన్ని వార్తలు