రద్దీ ప్రాంతాలే టార్గెట్‌ 

14 Apr, 2018 08:00 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న  డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌

యథేచ్ఛగా నకిలీ నోట్ల చలామణి 

పోలీసులకు  చిక్కిన ముఠా 

రూ.1.72 లక్షల నోట్లు స్వాధీనం 

ఇద్దరిపై కేసు నమోదు

ఆదోని టౌన్‌ : రద్దీ ప్రాంతాలే టార్గెట్‌గా దొంగనోట్ల ముఠా రెచ్చిపోయింది. పెట్రోల్‌ బంకులు, మార్కెట్‌యార్డు, బ్యాంకులు, మద్యం షాపులు, బార్లు.. ఇలా దేన్నీ వదలలేదు. దాదాపు 8 నెలల పాటు నకిలీ నోట్లను చలామణి చేసిందంటే వారి దందా ఏస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. నకిలీ నోట్లపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముఠా ఆటకట్టించారు. శుక్రవారం డీఎస్పీ అంకినీడు ప్రసాద్‌ తన చాంబర్‌లో వివరాలు వెల్లడించారు. 
ముఠా గుట్టు రట్టయిందిలా.. 
పట్టణంలో కొన్ని నెలలుగా నకిలీ నోట్లు చలామణి జరుగుతున్నట్లు పోలీసులు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఈక్రమంలో గురువారం పట్టణంలోని సత్య భారత్‌ పెట్రోల్‌ బంకులో గుర్తు తెలియని వ్యక్తి రూ.రెండు వంద  నోట్లు(నకిలీ) ఇచ్చి 2 లీటర్ల పెట్రోల్‌ పోయించుకొని చిల్లర తీసుకెళ్లాడు. నకిలీవని తేలడంతో బంకు మేనేజర్‌ అమీర్‌ షమీర్‌ ఖాన్‌ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు  సీఐ చంద్రశేఖర్, టూటౌన్‌ సీఐ వాసుకృష్ణ, ఎస్‌ఐ రామ్‌నాయక్, స్పెషల్‌ పార్టీ ఏఎస్‌ఐ ఆనంద్, సిబ్బంది రంగంలోకి దిగారు. ఈకమ్రంలో శుక్రవారం ఉదయం ఎమ్మిగనూరు రోడ్డు సర్కిల్‌లోని చిల్లీ డాబా దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆదోని మండలం 104 బసాపురం గ్రామానికి చెందిన కమ్మ కిష్టప్పను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారించడంతో నకిలీనోట్లు చలామణి చేస్తున్నట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా అతడి నుంచి రూ.25 వేల నకిలీ వంద నోట్లు, బైక్, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు పత్తికొండ బస్టాండ్‌ సమీపంలో సోడాషాపు నిర్వహిస్తున్న సత్యనారాయణను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.1.47 లక్షల నకిలీ వంద నోట్లు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. 

ఒకటికి మూడు నోట్లు 
నెల్లూరు జిల్లా కావలి చెందిన ఓ వ్యక్తి వద్ద ఒక ఒరిజినల్‌ నోటుకు మూడు నకిలీ నోట్ల చొప్పున తెచ్చుకున్నట్లు నిందితులు అంగీకరించారు. ఆదోని, కౌతాళం, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలలో వాటిని చలామణి చేశారు. కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి కూడా నకిలీ నోట్లు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దొంగనోట్ల  చలామణికి సంబంధించి సూత్రధారుల కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పెషల్‌ పార్టీ ఏఎస్‌ఐ ఆనంద్, కానిస్టేబుళ్లు శాంతరాజు, ఎలిసా, రంగ, క్రిష్ణకు నగదు రివార్డు ప్రదానం చేశారు. సీఐలు చంద్రశేఖర్, వాసుకృష్ణకు అవార్డుల కోసం జిల్లా ఎస్పీకి సిఫారసు చేయనున్నట్లు డీఎస్పీ చెప్పారు.

మరిన్ని వార్తలు